ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయేలా.. రికార్డు విక్టరీతో కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇక తాము అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసిన అనేక పనులను తిరిగి ప్రారంభిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పదేపదే చెప్తూ వచ్చారు. అన్నట్లుగానే టీడీపీ కూటమి అధికారంలోకి రాగా.. చెప్పిన పనులు చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అయితే ఓ విషయంలో మాత్రం బావ చంద్రబాబు కంటే బాలయ్య ముందే ఉన్నారు.
నందమూరి అందగాడు, నటసింహం బాలకృష్ణ సోమవారం తన 64వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈసారి తన నియోజకవర్గం హిందూపురంలో బాలయ్య తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే అన్న క్యాంటీన్‌ను బాలకృష్ణ ప్రారంభించారు. హిందూపురం నుంచి హ్యాట్రిక్ కొట్టినందుకు, అలాగే రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చినందుకు గానూ బాలయ్య అన్న క్యాంటీన్ ప్రారంభించారు. అయితే రాష్ట్రంలో ఏర్పాటైన తొలి అన్న క్యాంటీన్ ఇదే కావటం విశేషం. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీడీపీ అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. నిరుపేదలకు తక్కువ ధరకే నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలనే సంకల్పంతో చంద్రబాబు అన్న క్యాంటీన్లను తీసుకువచ్చారు.
అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే వైఎస్ జగన్ హయాంలో అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. దీనిపై విపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. పేద ప్రజలకు తక్కువ ధరకే ఆహారం అందించే అన్న క్యాంటీన్లను మూసివేయడం అన్యాయం అంటూ పెద్దఎత్తున ఆందోళనలు సైతం చేశారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సహా నారా లోకేష్, బాలకృష్ణ పలు సందర్భాల్లో హామీలు ఇచ్చారు.
2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. త్వరలోనే చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించడంపైనా ఆలోచనలు జరుగుతున్నాయి. అయితే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం చంద్రబాబు కంటే ముందే అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. పుట్టినరోజు సందర్భంగా హిందూపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు బాలయ్య. ఆ రకంగా బావ కంటే ఓ అడుగు ముందే నిలిచారు.