ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైంది. 151 ఎమ్మెల్యే సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. ఊహించని రీతిలో ఘోర ఓటమిని మూటగట్టుకున్న వైసీపీ నేతలు.. ఓటమికి గల కారణాలను వెతుక్కునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే కొంతమంది వైసీపీ ఓటమికి ఇవే కారణాలంటూ తమ గొంతు వినిపిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేసిన నల్లగట్ల స్వామి దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమిని ఊహించలేకపోయామని.. ఐప్యాక్ టీమ్, ఆరా మస్తాన్ సర్వేను నమ్మి నిండా మునిగిపోయామంటూ సన్నిహితుల మధ్య వాపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగట్ల స్వామి దాస్ తిరువూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఎన్నికలకు ముందు వరకూ టీడీపీలో పనిచేసిన స్వామి దాస్.. కేశినేని నానితో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ నుంచి తిరువూరు అసెంబ్లీ బరిలో నిలిచారు. అయితే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు చేతిలో నల్లగట్ల స్వామి దాస్ ఓడిపోయారు. 21 వేలకుపైగా మెజారిటీతో స్వామి దాస్‌పై కొలికపూడి శ్రీనివాసరావు గెలుపొందారు.ఈ క్రమంలోనే తన ఓటమిపై సన్నిహితులు, మద్దతుదారుల వద్ద స్వామి దాస్ వాపోయారు.
ఎన్నికల సమయంలో కొన్ని పొరపాట్లు జరిగాయని స్వామి దాస్ చెప్పారు. ఐప్యాక్ టీమ్, ఆరా మస్తాన్ సర్వేపై భరోసా ఉంచి నష్టపోయామని అన్నారు. ఆరా మస్తాన్ సర్వే మరో లగడపాటి సర్వేలా మారిందని.. చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారని.. మునిగిపోయామంటూ నల్లగట్ల స్వామి దాస్ వాపోయారు. దీనికి సంబంధించి వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత ఐప్యాక్ టీమ్ వద్దకు వెళ్లిన వైఎస్ జగన్.. గతం కంటే ఈసారి ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తున్నామని చెప్పారు. అలాగే ఆరా మస్తాన్ సర్వే కూడా 90 నుంచి 100 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని.. వైసీపీదే అధికారమంటూ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడించింది.
ఇక ఐప్యాక్ టీమ్, ఆరా మస్తాన్ సర్వే ఫలితాలతో వైసీపీ శ్రేణులు తమదే విజయమంటూ ధీమాతో ఉన్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నాయి. అయితే ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలవ్వటంతో వైసీపీ నేతలు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమికి గల కారణాలను వెతుక్కునే పనిలో పడ్డారు.