ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో మరో వికెట్ పడింది. వైసీపీ నేత, విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు నాని. ఇక ఎన్నికల్లో గెలుపొందిన నాయకులు విజయవాడ అభివృద్ధికి కృషి చేయాలని నాని ట్వీట్లో కోరారు. మొన్నటి ఎన్నికల్లో కేశినేని నాని వైసీపీ తరపున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే సోదరుడు కేశినేని చిన్ని చేతిలో ఘోరంగా ఓడిపోయారు. దీంతో రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
" చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. నా రాజకీయ ప్రయాణాన్ని ఇక్కడితో ముగించా. రెండు సార్లు పార్లమెంటు సభ్యునిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం నాకు దక్కిన అపురూపమైన గౌరవం. విజయవాడ ప్రజల స్థైర్యం, దృఢ సంకల్పం నాకు స్ఫూర్తినిచ్చాయి. వారు నాకు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను రాజకీయాలకు దూరమవుతున్నా కూడా.. విజయవాడ అభివృద్ధి పట్ల నా నిబద్ధత అలాగే ఉంది. విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగిన విధంగా మద్దతు ఇస్తూనే ఉంటాను. నా రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. విజయవాడ అభివృద్ధి, శ్రేయస్సు కోసం పాటుపడుతున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు. విజయవాడ ప్రజలకు పదేళ్ల పాటు సేవ చేసే అపురూపమైన అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు" అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు.
మరోవైపు కేశినేని నాని 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ నియోజకవర్గం అభ్యర్థిగా టీడీపీ తరుఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ రకంగా టీడీపీ తరుఫున విజయవాడ ఎంపీగా రెండుసార్లు పనిచేసిన కేశినేని నాని.. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేసి.. సోదరుడు, టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని (కేశినేని శివనాథ్) చేతిలో ఓడిపోయారు. కేశినేని చిన్ని చేతిలో ఏకంగా 2 లక్షల 82 వేల ఓట్ల తేడాతో నాని ఓటమి పాలయ్యారు. దీంతో ఓటమి తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు కేశినేని నాని ప్రకటించారు.
అయితే విజయవాడ లోక్ సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు రాజకీయాల్లో కనుమరుగు కావటం గత కొంతకాలంగా జరుగుతూ వస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి కేశినేని నాని పోటీచేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కోనేరు రాజేంద్ర ప్రసాద్, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌లపై కేశినేని నాని విజయం సాధించారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కోనేరు రాజేంద్ర ప్రసాద్, పొట్లూరి వర ప్రసాద్ రాజకీయాలకు దూరమయ్యారు. తాజాగా ఓటమి తర్వాత కేశినేని నాని కూడా పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు.అయితే ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కేశినేని నాని.. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ మీద తీవ్రస్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.