ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఘనంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు కోసం కొత్త కాన్వాయి అంటూ కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు కోసం నూతన కాన్వాయి సిద్ధమైందని.. తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద వీటిని ఉంచినట్లు వార్తలు వచ్చాయి. మొత్తం 11 వాహనాలను అధికారులు సిద్ధం చేశారంటూ కొన్ని కార్ల ఫోటోలు బయటకు వచ్చాయి.
ఈ 11 కార్లలో రెండింటిని సిగ్నల్ జామర్ కోసం కేటాయించాంటూ కూడా ప్రచారం జరిగింది. టయోటా కంపెనీకి చెందిన బ్లాక్ కలర్ కార్లు చంద్రబాబు కొత్త కాన్వాయిలో చేరాయని.. వీటన్నింటికీ 393 నంబర్లు ఇచ్చారంటూ నెట్టింట ఓ రేంజులో ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక టీడీపీ అభిమానులు, కార్యకర్తలు కూడా చంద్రన్న కోసం కొత్త కాన్వాయి అంటూ ప్రచారం చేశారు. అయితే అసలు విషయం ఏంటో అధికారులు తెలిపారు. చంద్రబాబు కోసం కొత్త కాన్వాయ్ కొనుగోలు అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తమని తేల్చేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చక్కర్లు కొడుతున్న వార్తలను అధికారులు ఖండించారు. కాన్వాయ్ కోసం వినియోగిస్తున్న వాహనాలన్నీ పాత వాహనాలేనని.. ఎప్పటి నుంచో వినియోగిస్తున్నవే అని స్పష్టం చేశారు.ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ కూడా తన అధికారిక ఖాతా ద్వారా వెల్లడించింది. చంద్రబాబు కోసం కొత్త కాన్వాయి ఏమీ కొనుగోలు చేయలేదని తెలిపింది.
మరోవైపు జూన్ 12వ తేదీ జరగనున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు వీవీఐపీలు, వీఐపీలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణస్వీకారం వేదిక అయిన కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రధాన వేదికతో పాటు వీఐపీ, వీవీఐపీ, మరో మూడు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. 2 లక్షల మంది వచ్చినా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు.ప్రమాణ స్వీకారోత్సవానికి 10వేలమంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.