ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఎదురైన ఓటమితో నిరాశలో ఉన్న వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి మరో వికెట్ డౌన్ అయ్యింది. ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రిజల్ట్స్ వచ్చిన మూడురోజులకే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు రావెల కిషోర్ బాబు ప్రకటించారు. తాజాగా వైసీపీకి పట్టున్న రాయలసీమలో.. మరో కీలక నేత వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరు మేయర్ స్రవంతి. ఆమె భర్త జయవర్ధన్ వైసీపీకీ రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. టీడీపీ నేత, నెల్లూరు గ్రామీణం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట నడుస్తామని స్పష్టం చేశారు.
నెల్లూరు మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితోనే తమ ప్రయాణమని స్పష్టం చేశారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన సమయంలోనూ వీరూ ఆయన వెంట వెళ్తున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని రోజులకే తిరిగి వైసీపీలో చేరిపోయారు. అయితే దీనికి అధికార పార్టీ ఒత్తిళ్లే కారణమని స్రవంతి చెప్తున్నారు. రాజకీయ నేపథ్యం లేని తనను కార్పొరేటర్‌గా గెలిపించి మేయర్ చేసిన కోటంరెడ్డి వెంటే నడుస్తామని స్రవంతి తేల్చిచెప్పారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమలాంటి ఎంతో మంది కార్యకర్తలకు అండగా ఉండి.. రాజకీయంగా అవకాశాలు ఇచ్చారని.. ఇకపై ఆయనతోనే తన ప్రయాణమని స్రవంతి దంపతులు స్పష్టం చేశారు. ఇక నెల్లూరు కార్పొరేషన్‌లో ఫోర్జరీ సంతకాలపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపైనా దర్యాప్తు జరిపిస్తామని స్రవంతి తెలిపారు. తన భర్త జయవర్ధన్‌కు పాత్ర ఉందని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని.. వాస్తవాలు విచారణలో తేలుతాయన్నారు.
మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఈసారి ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలతో పాటుగా.. ఎంపీ సీటులోనూ టీడీపీ విజయం సాధించింది. నెల్లూరు ఎంపీ కోసం టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి పోటీచేయగా.. విజయం వేమిరెడ్డిని వరించింది. అలాగే నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద విజయం సాధించారు. అయితే ఫలితాలు వెల్లడై ప్రభుత్వం కూడా ఏర్పాటు కాకముందే నెల్లూరు మేయర్.. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం నెల్లూరు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.