ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు వచ్చాయి. అయితే ఎన్నికలపై ఎవరు గెలుస్తారని వేల కోట్ల రూపాయలు బెట్టింగ్‌లు నడిచాయి. బెట్టింగ్‌లు వద్దని పదే, పదే చెప్పినా వినకుండా కొందరు అప్పులు చేసి మరీ పందాలు కట్టారు. వైఎస్సార్‌సీపీ గెలవడం ఖాయమని భావించిన కొందరు నమ్మకంగా ఆ పార్టీపై పందేలు కాశారు.. కానీ ఫలితాలతో పూర్తిగా ఢీలా పడ్డారు. ఓ వైఎస్సార్‌సీపీ నేత కూడా ఇలాగే.. 30 కోట్ల వరకు పందెం వేశారు. వైఎస్సార్‌సీపీ ఓడిపోవడంతో.. ఆ డబ్బులు చెల్లించే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకోవడం కలకలంరేపింది.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లికి చెందిన జగ్గవరపు వేణుగోపాలరెడ్డి ఏడో వార్డు మెంబర్ కాగా.. ఆయన భార్య సర్పంచ్‌గా ఉన్నారు. వీరు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు కావడంతో.. ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో వేణుగోపాలరెడ్డి వివిధ గ్రామాలకు చెందిన వారితో బెట్టింగ్‌లకు దిగారు. ఏకంగా రూ.30 కోట్ల వరకు పందాలు వేయగా.. తీరా ఫలితాలు రివర్స్ అయ్యాయి. తాను అనుకున్న అంచనాలు తారుమారు కావడంతో.. ఆ డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో భయపడిన వేణుగోపాల్ రెడ్డి ఊరిని వదిలి వెళ్లిపోయారు.. తిరిగి ఇంటికి కూడా రాలేదు.
వేణుగోపాల్ రెడ్డికి పందెం వేసిన వారు ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చింది. వారంతా ఈ నెల 7న ఆయన ఇంటికెళ్లి తలుపులు పగులగొట్టారు.. లోపల ఉన్న ఏసీలు, సోఫాలు, మంచాలు, విలువైన వస్తువులు తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన జరిగిన తర్వాత వేణుగోపాల్ రెడ్డి ఊరికి వచ్చారు.. జరిగిందంతా తెలిసి మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం పొలం దగ్గరకు వెళ్లి పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు మృతదేహం దగ్గర ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన భర్త కొద్ది రోజులుగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారని.. అందుకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తనకు స్థానికుల ద్వారా తెలిసిందని వేణుగోపాల్ రెడ్డి భార్య విజయలక్ష్మి అంటున్నారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.