ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలసిందే. ఈక్రమంలో ఆయన కోసం కాన్వాయ్ వచ్చేసింది..తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం దగ్గర మొత్తం 11 వాహనాలతో కాన్వాయ్ సిద్ధం చేశారు అధికారులు. ఈ వాహనాల్లో రెండింటిని సిగ్నల్ జామర్ కోసం కేటాయించగా.. టయోటా కంపెనీకి చెందిన నలుపు రంగు వాహనాలకు 393 నెంబర్లతో సిద్ధమయ్యాయి. వీటిని చంద్రబాబు కాన్వాయ్ కోసం తయారు చేసినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఉండే కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో వేదికను సిద్ధం చేస్తున్నారు. బుధవారం (జూన్ 12న) ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరు హాజరవుతారని తెలుస్తోంది. కేసరపల్లి ఐటీ పార్క్ ప్రధాన వేదికతో పాటు వీఐపీ, వీవీఐపీ, మరో మూడు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. వాహనాలను నిలిపేందుకు వేదిక చుట్టుపక్కల ఐదు ప్రాంతాల్లోని 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు ఒకవేళ వర్షం పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా షెడ్లను వేస్తున్నారు.. సుమారు 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన 11.5 ఎకరాల్లో నేతలు, ప్రజలకు నాలుగు గ్యాలరీలను.. సభా ప్రాంగణంతో పాటు బయట ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ కూడా దగ్గరగా ఉండటంతో.. నేరుగా అక్కడి నుంచే సభా ప్రాంగణానికి వచ్చేలా చూస్తున్నారు. అంతేకాదు సభా ప్రాంగణం దగ్గర వైద్య శిబిరాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే వీవీఐపీలు, వీఐపీలు, ప్రముఖుల కోసం విజయవాడ నగరంలోని పెద్ద హోటళ్లలోని గదులన్నింటినీ ప్రభుత్వం బుక్ చేసింది.
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో వీవీఐపీ, వీఐపీ, ఇతరత్రా పాస్‌లను సిద్ధం చేస్తున్నారు. ఆ పాస్‌లను నియోజకవర్గాలవారీగా పంపిణీ చేయనున్నటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి 10వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి గన్నవరంలోని వేదిక వరకూ 22 కిలోమీటర్ల పరిధిలో భద్రతను కట్టుదిట్టి చేస్తున్నారు.
ప్రధాని మోదీ వస్తుండటంతో ఎస్పీజీ టీమ్ ఇప్పటికే విజయవాడ చేరుకున్నట్లు తెలుస్తోంది. వాహన శ్రేణి ప్రయాణించే మార్గంలో ట్రయల్ నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్నిసూచనలు చేశారట.