కేంద్రంలో, రాష్ట్రంలో నూతన ప్రభుత్వాలు ఏర్పాటు కావడం ఆనందంగా ఉందన్నారు విశాఖపట్నం శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. అమ్మ వారి కృప చేత నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయడం ఆనందం కలిగించిందన్నారు. బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్ర బావుండాలని తాము కూడా యాగాలు చేస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్నది అద్భుతమైన ముహూర్తమని చెప్పారు.. సింహ లగ్నమని, ప్రజలకు నచ్చే విధంగా పరిపాలన చేయాలని ఆశీర్వదిస్తున్నానన్నారు. నకు అత్యంత ఆత్మీయుడు ఆయిన ఎర్రన్నాయుడు కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్ మంత్రి కావడం సంతోషంగా ఉందన్నారు.ఇది తెలుగు వారికి దక్కిన గౌరవమన్నారు. ఏ ప్రభుత్వ వచ్చినా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని.. సంపాదించుకోవాలి, దోచుకోవాలని అనుకునే పీఠం కాదన్నారు.
తాను చంద్రబాబుని కొత్తగా పొగుడుతున్నానని అనుకోవద్దని.. తన వ్యక్తిత్వం పెద్దలకు బాగా తెలుసన్నారు స్వరూపానంద. చంద్రబాబు గెలవాలని గతంలో మురళీమోహన్‌తో కలిసి సాధువులందరితో కలిసి సమావేశం పెట్టి పూజలు చేశామని.. ఎవరికీ భయపడి ఈ ప్రెస్ మీట్ పెట్టడం లేదన్నారు. తప్పుడు అభిప్రాయాలు వెల్లడించకుండా ప్రెస్ మీట్ పెడుతున్నామని.. చంద్రబాబు అంటే చాలా గౌరవం, చాలా సీనియర్ నేత అన్నారు. ఆయన ఆరోగ్యం బావుండాలి, ఈ సారైనా దేవాలయాల పాలన బావుండాలి అన్నారు. అమరావతిలో సైతం శారద పీఠం కోసం స్థలం కొనుగోలు చేశామని.. అక్కడ కూడా శారదా పీఠం నిర్మిస్తామన్నారు. ప్రమాణ స్వీకారం రోజున ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుతూ తాము కూడా యాగాలు చేస్తున్నాం అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చిన ప్రజలు బాగుండాలనేది తమ ఆకాంక్ష అని.. చంద్రబాబు పరిపాలన అనుభవం కలిగిన వ్యక్తి అన్నారు స్వరూపానంద. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా.. ఎవరు తమ వద్దకు వచ్చినా.. తాము ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతామని, దూరమైనా ఫర్వాలేదన్నారు.
ప్రజలకు మేలు గలిగేలా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరిపాలించాలని ఆశీర్వాదాలు ఉండాలని.. కేంద్రంతో ఉండే సన్నిహిత సంబంధాలతో చంద్రబాబు గొప్పగా పాలించగలరని ఆశిస్తున్నామన్నారు స్వరూపానంద. ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని.. త్వరలోనే చతుర్మాస పూజల కోసం రుషికేశ్ వెళ్తున్నానన్నారు. అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ఆశీస్సులు అందిస్తున్నానన్నారు. తాను హైదరాబాద్‌లోని శారదా పీఠంలో స్థిరపడాలని అనుకుంటున్నట్లు మనసులో మాట చెప్పారు. శారదాపీఠానికి ఏడు రాష్ట్రాల నుంచి గవర్నర్‌లు వచ్చారని.. వివిధ రాష్ట్రాల నుంచి సీఎంలు వచ్చారన్నారు.