అసలే మృగశిర కార్తె నడుస్తోంది.ఈ కార్తెలో చేపలు తినాలని పెద్దలు చెప్తుంటారు. దీంతో మృగశిర కార్తె వస్తే చేపల రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక అవే చేపలు రోడ్డుపై ఫ్రీగా దొరికితే.. ఇంకేం జనం ఎగబడిపోతుంటారు. ఎన్టీఆర్ జిల్లాలోనూ అలాంటి ఘటనే జరిగింది.ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద జాతీయ రహదారిపై చేపల లోడుతో వెళ్తున్న మినీ ట్రక్కు బోల్తాపడింది. చేపలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో చేపల కోసం జనం ఎగబడ్డారు. అందిన కాడికి కవర్లలో తీసుకెళ్లిపోయారు. మరికొంతమంది కూడా వీటిని తీసుకెళ్లడానికి రోడ్డుపైకి చేరుకున్నారు.
అయితే ఆఖర్లో అసలు ట్విస్ట్ బయట పడింది. ట్రక్కులో తీసుకెళ్తున్నవి క్యాట్ ఫిష్‌లని తేలింది. నిషేధిత క్యాట్ ఫిష్‌లతో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మినీ ట్రక్ ప్రమాదవశాత్తు నవాబుపేట వద్ద జాతీయ రహదారిపై బోల్తా పడింది. వెనుక టైర్ అకస్మాత్తుగా పేలడంతో.. ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.అయితే చేపలను తీసుకెళ్తున్న సమయంలో కొంతమంది అవి క్యాట్ ఫిష్‌లని గ్రహించారు. ఆ చేపలు ఆరోగ్యానికి హానికరమని తెలిసి వాటిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పెనుగంచిప్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చేపలను గోనె సంచుల్లో వేసి తీసుకెళ్లారు. అలాగే, మినీ ట్రక్ డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ చేపలు ఎక్కడికి తీసుకెళ్తున్నారని డ్రైవర్‌ను అడగగా.. సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది.
అయితే తెలుగు రాష్ట్రాలలో క్యాట్ ఫిష్ పెంపకం, విక్రయాలపై నిషేధం కొనసాగుతోంది. క్యాట్ ఫిష్‌లను తింటే అనారోగ్యానికి గురౌతామని వైద్యులు చెప్తున్నారు. క్యాట్ ఫిష్‌లో ఉండే ఒమేగా ఫ్యాట్ 6 ఆమ్లాలతో నరాల వ్యవస్థ దెబ్బతింటుందని.. క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే కొన్నిచోట్ల కొరమీను పేరుతో క్యాట్ ఫిష్ విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ క్యాట్ ఫిష్ కేవలం ఆరు నెలల్లోనే 20 కేజీల వరకూ బరువు పెరుగుతుంది. కుంటలు, చెరువుల్లో పెరిగే ఈ చేపలు.. మిగతా వాటిని చంపేస్తూ ఉంటాయి. దీంతో వీటివల్ల పర్యావరణానికి కూడా ముప్పు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.