ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో ఆదివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు సోమనారం శాఖలు కేటాయించారు. ఆదివారం ప్రధానమంత్రితో సహా 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి సోమవారం శాఖలను కేటాయించారు. కీలక శాఖలు బీజేపీకే దక్కాయి. హోం శాఖ, ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, రైల్వేశాఖ ఇలా కీలక శాఖలకు పాతవారినే మంత్రులుగా కొనసాగించారు. ఇక ఏపీ నుంచి ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడికి కేబినెట్ బెర్తు దక్కగా.. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు సహాయమంత్రి పదవులు దక్కాయి.
ఇక శాఖల కేటాయింపులో భాగంగా కింజరాపు రామ్మోహన్ నాయుడికి పౌరవిమానయాన శాఖ దక్కింది. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రిగా నియమించారు. అలాగే నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయమంత్రి పదవిని కేటాయించారు. అయితే శాఖల కేటాయింపును పరిశీలిస్తే ఆసక్తికర అంశం తెలుస్తుంది. కింజరాపు రామ్మోహన్ నాయుడికి పౌరవిమానయాన శాఖను కేటాయించగా.. గతంలోనూ టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఈ శాఖ బాధ్యతలు చూశారు. 2014లో కూడా టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అప్పట్లో అశోక్ గజపతిరాజు పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కూడా ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నేతకు పౌరవిమానయాన శాఖ దక్కడం ఆసక్తికరం.
ఇక గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ విషయానికి వస్తే.. ఎంపీగా గెలిచిన తొలిసారే ఆయనను కేంద్రమంత్రి పదవి వరించింది. శాఖల కేటాయింపులో పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు కూడా గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులుగా పనిచేశారు. అయితే వారికి కేబినెట్ మంత్రి పదవి దక్కగా.. పెమ్మసానికి మాత్రం సహాయ మంత్రి పదవి దక్కింది.
ఇక నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాక మంత్రిగా కుమారస్వామికి అవకాశం దక్కగా.. సహాయమంత్రిగా శ్రీనివాసవర్మ కొనసాగనున్నారు. 34 ఏళ్లుగా బీజేపీ కోసం పనిచేస్తూ వచ్చిన శ్రీనివాస వర్మకు తొలిసారిగా ఎంపీగా గెలుపొందారు. 2009లోనూ నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన ఓటమిపాలయ్యారు. అయితే ఈసారి విజయం సాధించగా.. తొలిసారిగా ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించారు.