ఏపీలో త్వరలోనే నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది. జూన్ 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఇందుకోసం ఏర్పాట్లు కూడా చకా చకా జరుగుతున్నాయి. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీపార్క్ వద్ద జూన్ 12 ఉదయం 11:27 నిమిషాలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఆయనతో పాటుగా మరికొందరు మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశాలున్నాయి. అయితే సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత ఏ ఫైల్ మీద తొలి సంతకం చేస్తారనే దానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేరకు ఈ మూడు ఫైళ్ల మీద చంద్రబాబు సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపై ఉండనుంది. ఎన్నికల సమయంలోనే చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు. వైసీపీ మెగా డీఎస్సీ అంటూ మోసం చేసిందని.. తాము అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే ఉండే ఛాన్సుంది. ఇక రెండో సంతకం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా టీడీపీ అధినేత అనేక బహిరంగ సభలలో ప్రకటించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చిందంటూ అప్పట్లో టీడీపీ విమర్శించింది.
పేదల భూములు లాక్కునేందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారంటూ చంద్రబాబు సహా టీడీపీ కూటమి నేతలు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద రెండో సంతకం చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు ఆయన రెండో సంతకం దానిపైనే ఉండే ఛాన్సుంది. అయితే ఇది కేంద్రం తెచ్చిన స్కీమ్ కావటంతో సాధ్యాసాధ్యాలను పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు మూడో సంతకం పింఛన్ల పెంపు మీద ఉండే అవకాశం ఉంది.
టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు నాలుగు వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రకటించింది. అలాగే ఏప్రిల్ నెల నుంచే ఈ పింఛన్ పెంపును అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు.. నెలకు వేయి చొప్పున అదనంగా రావాల్సిన పింఛన్‌ను కలిపి జూన్ నెల పింఛన్ ఏడు వేలు అందిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పింఛన్లు పెంపుపై చంద్రబాబు నాయుడు మూడో సంతకం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.