ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారింది. టీడీపీ కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి పలు హామీలు ఇచ్చింది. మహిళలే లక్ష్యంగా పలు హామీలు ప్రకటించింది. అలాంటి వాటిలో మొదటిది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికే మన పొరుగున ఉన్న తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలో అమలవుతోంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు రెడీ అవుతున్నారు.
విశాఖపట్నం రీజియన్‌లో మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఆర్టీసీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం పూర్తికాగానే తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అమలుకు ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. దీంతో ఇప్పటినుంచే ముందస్తు ఏర్పాట్లు మొదలెట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు వీలుగా అవసరమైన బస్సులను విశాఖ ఆర్టీసీ రీజియన్ అధికారులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే టికెట్ ఇష్యూ మెషీన్లో సాఫ్ట్ వేర్ లోడింగ్, మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఉండే రూట్ల గుర్తింపులో పడ్డారు.
విశాఖపట్నం రీజియన్‌కు సంబంధించి 579 బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. తెలంగాణలో ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోనూ ఈ బస్సు సర్వీసుల్లో ఫ్రీ జర్నీ కల్పించవచ్చనే అంచనాతో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. ఇందుకోసం విశాఖ రీజియన్‌లోని సిటీ ఆర్డినరీ, పల్లెవెలుగు, సిటీ ఎక్స్ ప్రెస్ వంటి 579 సర్వీసులలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించవచ్చని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం విశాఖ రీజియన్‌లో రోజూ 1.8 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వీరిలో 80 వేల మంది వరకూ మహిళలు ఉంటారని అంచనా.
ఉచిత బస్సు ప్రయాణం హామీ అమల్లోకి వస్తే ఈ సంఖ్య లక్షలకు చేరవచ్చని విశాఖ రీజియన్ ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు సరిపడా బస్సులను అందుబాటులో ఉంచుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేయగానే విజయవంతంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.