విజయవాడ, కృష్ణా జిల్లావాసులకు అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈనెల 12న ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి ఐటీపార్కు వద్ద నిర్వహిస్తున్న ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు, గవర్నర్లు, ప్రముఖులు హాజరవుతున్నారు. అందుకే వాహనదారులు ఇబ్బందులు పడకుండా, రవాణాకు అంతరాయం ఏర్పడకుండా ట్రాఫిక్ మళ్లింపులు చేసినట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటాయన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.
విశాఖపట్నం నుంచి చెన్నై వైపు వెళ్లే అన్ని వాహనాలను కత్తిపూడి నుంచి 216 జాతీయ రహదారి మీదుగా ఒంగోలు వైపు మళ్లించారు. అలాగే విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లి వచ్చే వాహనాలను కత్తిపూడి నుంచి ఒంగోలు వైపు మళ్లించినట్లు తెలిపారు. చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వచ్చే వాహనాలను ఒంగోలు నుంచి రేపల్లె మీదుగా వయా మచిలీపట్నం, కృత్తివెన్ను, నరసాపురం, అమలాపురం మీదుగా.. కాకినాడ, కత్తిపూడి మీదుగా విశాఖ వైపు మళ్లించామన్నారు. అలాగే బుడంపాడు నుంచి తెనాలి, పులి గడ్డ, మచిలీపట్నం, లోసరి వంతెన నరసాపురం, అమలాపురం, కాకినాడ, కత్తిపూడి మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించినట్లు చెప్పారు.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కూడా మళ్లించామని.. ఈ వాహనాలు గామన బ్రిడ్జి, దేవపరల్లి, జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. అలాగే భీమడోలు, ద్వారకా తిరుమల, కామవరపుకోట, చింతలపూడి నుంచి ఖమ్మంవైపు వాహనాలను మళ్లించినట్లు తెలిపారు. ఏలూరు బైపాస్ నుంచి జంగారెడ్డిగూడెం, అశ్వారాపుపేట, ఖమ్మం మీదుగా వాహనదాలు హైదరాబాద్ వైపు వెళ్లాలని తెలిపారు. ఏలూరు బైపాస్ నుంచి చింతలపూడి, సత్తు మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లొచ్చన్నారు. హనుమాన్‌జంక్షన్ నుంచి వెళ్లే వాహనాలు నూజివీడు, మైలవరం, ఇబ్రహీంపట్నం, నందిగామ మీదుగా హైదరాబాద్ వైపు మళ్లించినట్లు చెప్పారు.
హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చే వాహనాలను కూడా పోలీసులు మళ్లించారు. నందిగామ, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారాపుపేట, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, గామన బ్రిడ్జి మీదుగా విశాఖపట్నం వైపు ఈ వాహనదాలను మళ్లించినట్లు తెలిపారు. అలాగే ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు, హనుమాన్‌జంక్షన్ నుంచి ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు వాహనాలను మళ్లించామని పోలీసులు చెప్పారు. అంతేకాదు విజయవాడలోని రామవరప్పాడు, నున్న, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్‌జంక్షన్, ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు వాహనాలను మళ్లించారు. విజయవాడ నుంచి ఎనికేపాడు మీదుగా 100 అడుగుల రోడ్డు, తాడిగడప, కంకిపాడు, పామర్రు, గుడివాడ నుంచి భీమవరం వైపు వాహనాలను మళ్లించారు పోలీసులు. ప్రయాణికులు ఈ మళ్లింపుల్ని గమనించాలని పోలీసులు సూచించారు.