కేరళలోని తొలిసారి బీజేపీ ఒక్క పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకుంది. దీంతో త్రిసూరు నుంచి ఆ పార్టీ తరఫున ఎన్నికైన సురేశ్ గోపికి కేంద్ర మంత్రివర్గంలో చోటుకల్పించింది. ఆదివారం ఆయన కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఒక్క రోజైనా గడవక ముందే ఆయన.. మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి సురేశ్ గోపి.. అదంతా తప్పుడు ప్రచారమని ఖండించారు తాను రాజీనామా చేస్తానంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.
‘మోదీ క్యాబినెట్‌లో మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కొన్ని మీడియాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోంది.. ఇందులో నిజం లేదు.. ప్రధాని మోదీ నాయకత్వంలో కేరళ సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం’ అని ఆయన ట్వీట్టర్ (ఎక్స్)లో స్పష్టం చేశారు. ముందుగా అంగీకరించిన సినిమాలను పూర్తిచేయాల్సి ఉందని, మంత్రివర్గం నుంచి తనను తప్పించాలని ప్రధాన మంత్రిని సురేశ్ గోపి కోరినట్టు జాతీయ మీడియాలో ప్రచారం జరిగింది.
‘కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఢిల్లీలో సురేశ్ గోపి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎంపీగా పనిచేయడమే నా లక్ష్యం.. అంతకంటే నాకు ఇంకే పదవి అక్కర్లేదు.. ఈ పదవి నాకు అవసరం లేదని చెప్పాను.. త్వరలో నేను ఈ బాధ్యతల నుంచి రిలీవ్ అవుతానని అనుకుంటున్నాను.. త్రిసూర్ ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేదు.. వారికి అది తెలుసు, ఎంపీగా నేను వారికి బాగా పని చేస్తాను. నేను నా సినిమాలు ఎలాగైనా పూర్తిచేయాలి’’ అని అన్నారు. అయితే, కొద్దిసేపటి తర్వాత సురేశ్ గోపి కార్యాలయం దీనిపై స్పష్టత నిచ్చింది. ఆయన మాటలను వక్రీకరించారని, శాఖను కేటాయించిన తర్వాత ఎంపీ పూర్తి స్పష్టత ఇస్తారని పేర్కొన్నారు.
కేరళ నుంచి సురేశ్ గోపితో పాటు బీజేపీ సీనియర్ నేత జార్జి కురియన్‌కు కేంద్ర క్యాబినెట్‌లో చోటుదక్కింది. కేరళలో బలపడాలని భావిస్తోన్న బీజేపీ.. అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. 2026లో జరిగే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించాలని ఆశిస్తోంది. ఈ ఎన్నికల్లో త్రిసూర్‌లో వామపక్షాల అభ్యర్థి, సీపీఐ నేత వి సునిల్ కుమార్‌పై 74 వేల ఓట్ల మెజార్టీతో సురేశ్ గోపి విజయం సాధించి, బీజేపీ నుంచి గెలిచిన తొలి ఎంపీగా రికార్డుల్లోకి ఎక్కారు. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి మురళీధరన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ‘త్రిసూర్ నుంచి కేంద్ర మంత్రి.. మోదీ గ్యారెంటీ’ నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.