మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. మోదీ, 71 మంది కేంద్ర మంత్రులతోనూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. అయితే, ఈ సమయంలో చిరుతపులి ఆ భవనంలో సంచరిస్తున్నట్టు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ బీజేపీ ఎంపీ దుర్గాదాస్ మంత్రిగా ప్రమాణం చేసి.. సంతకాలు పెట్టి పేపర్‌వర్క్ పూర్తి చేసి కుర్చీలోంచి లేస్తున్నారు. అప్పుడు వెనుకాల మెట్ల తర్వాత వరండాలో చిరుతపులి తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. చిరుతలను కూడా రాష్ట్రపతి భవన్‌లో పెంచుతున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవి చిరుతలు కాదని పిల్లి లేదా కుక్క అయ్యి ఉంటుందని కొందరు... కాదు కాదు అవి చిరుతలేనని మరికొందరు అంటున్నారు. ‘ఒకవేళ అది పిల్లి అయితే ఏం ఇబ్బంది లేదు.. కానీ చిరుత అయితే భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నట్టు.. ఇది రాష్ట్రపతి భవన్‌లో పూర్తిగా భద్రతా ఉల్లంఘనే?’ అని ఓ నెటిజన్ మండిపడ్డాడు. దాని తోక, ఆకారం చూస్తే అది చిరుతుపులిలాగే ఉంది.. ఆ జంతువు ఏమీ పట్టనట్టు ప్రశాంతంగా వెళ్లిపోవడంతో అక్కడున్నవాళ్లు నిజంగా అదృష్టవంతులు’ అని మరో యూజర్ కామెంట్ పెట్టాడు.
ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్రపతి భవన్ కారిడార్‌లో తిరుగుతున్న జంతువు గురించి తెగ చర్చ జరుగుతోంది. రాజధాని ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్ ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే భారత్‌కు విచ్చేసే ప్రతి ప్రధాన విదేశీనేత గౌరవార్థం అక్కడే ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తారు. చాలా కాలంగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. మూడు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ భవనంలో 340 గదులు ఉంటాయి. 90 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ భవనానికి ఆర్కిటెక్చర్ ఎడ్విన్ లూటిన్స్.. పలు ప్రభుత్వ కార్యక్రమాలు, విందులు, ఆతిథ్యానికి వేదికైన రాష్ట్రపతి భవన్‌లో రెండు వంటశాలలు ఉన్నాయి. ఒకటి రాష్ట్రపతి వ్యక్తిగత వంటగది కాగా.. రెండోది రాష్ట్రపతి భవన్‌లోని అన్ని అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు, విందులు, సమావేశాలలో క్యాటరింగ్ ఏర్పాట్లకు బాధ్యత వహిస్తుంది.