మణిపూర్ సీఎం భద్రతా సిబ్బంది వాహనాలపై తిరుగుబాటుదారులు మెరుపు దాడికి తెగబడ్డారు. గత వారం రోజుల నుంచి హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోన్న జిరిబామ్ జిల్లాలో ముఖ్యమంత్రి బబీరేన్ సింగ్ పర్యటనకు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా భద్రతా బృందం తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. భద్రతా బలగాల కాన్వాయ్‌పై అనుమానిత తిరుగుబాటుదారులు పలుసార్లు కాల్పులు జరిపారు. జాతీయ రహదారి-53 పొడవునా కోట్లెన్ గ్రామ సమీపంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో కనీసం ఇద్దరు జవాన్లు గాయపడినట్టు తెలుస్తోంది.
గత వారం నుంచి మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది వారాల కిందట కనిపించకుండా పోయిన మైతీ తెగకు చెందిన సొయిబమ్ శరత్‌కుమార్ సింగ్ (59) అనే రైతు దారుణ హత్యకు గురయ్యాడు. జూన్ 6న అతడి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పొలంకి వెళ్లి తిరిగి వస్తున్న శరత్‌ను అపహరించిన దుండుగులు.. పదునైన వస్తువుతో పొడిచి చంపినట్టు పోలీసులు వెల్లడించారు. మైతీల్లో ఆగ్రహజ్వాలలు ఎగసిపడ్డాయి. స్థానికంగా ఉండే కుకీల ఇళ్లకు నిప్పు పెట్టి.. హింసకు పాల్పడ్డారు. దీంతో జిరిబామ్ జిల్లా మేజిస్ట్రేట్ అల్లర్లను నిరోధించడానికి జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు.
పరిస్థితి వేగంగా క్షీణించి క్రమంగా పొరుగున్న ఉన్న అసోంకి వ్యాపించింది. విభిన్న జాతుల నేపథ్యాలకు చెందిన సుమారు 600 మంది స్వస్థలాల నుంచి పారిపోయి కాచర్ జిల్లా లఖిపూర్‌లో ఆశ్రయం పొందుతున్నారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉండే జిరిబామ్.. అసోం సరిహద్దుల్లోని వ్యూహాత్మక ముఖద్యారం. నేషనల్ హైవే 37 దీని గుండా ప్రయాణిస్తుంది. చుట్టుపక్కల కొండలలో అనేక కుకి గ్రామాలు ఉండటం దీని ప్రాముఖ్యతను మరింత నొక్కి చెబుతుంది. కాగా, గతేడాది మే నుంచి రెండు నెలల పాటు హింసాత్మక ఘటనలతో మణిపూర్ అట్టుడికిపోయింది. జాతుల మధ్య వైరంతో చెలరేగిన హింసలో 150 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల మంది గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.