ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ 3.0 పాలన షురూ.. స్పీకర్ పదవి ఎవరికి? బిగ్ క్వశ్చన్

national |  Suryaa Desk  | Published : Mon, Jun 10, 2024, 09:15 PM

కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీకి సంపూర్ణ మెజార్టీ సాధించడంతో మోదీ సారథ్యంలోని గత రెండు ప్రభుత్వాలు పూర్తికాలం అధికారంలో కొనసాగాయి. కానీ, ప్రస్తుత ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్‌ కంటే తక్కువ సీట్లు రావడంతో మిత్రపక్షాలపై బీజేపీ ఆధారపడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఎన్డీయేలోని టీడీపీ, జేడీ(యూ)లు కింగ్ మేకర్లుగా మారాయి. దీంతో క్యాబినెట్ కూర్పు విషయంలో ఏకాభిప్రాయ సాధనకు చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్‌లతో బీజేపీ అగ్రనాయకత్వం చర్చించాల్సి వచ్చింది. అయితే, ఫలితాలు వెలువడిన నాలుగు రోజులకే 72 మంది మంత్రులతో కూడిన పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని మోదీ ఏర్పాటుచేశారు.


మోదీ 3.0 క్యాబినెట్‌లో టీడీపీ, జేడీయూలకు రెండేసి చొప్పున పదవులు దక్కాయి (ఒక క్యాబినెట్, ఒక సహాయ మంత్రి). ఈ నేపథ్యంలో స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జేడీయూ, టీడీపీలు ఈ పదవి కోసం పట్టుబడుతున్నట్టు మీడియాలో ప్రచారం సాగుతోంది. కానీ, వాటికి అప్పగించడానికి అధిష్ఠానం సిద్ధంగా లేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి.


రాజ్యాంగ నిబంధనలు ప్రకారం.. కొత్త లోక్‌సభ మొదటి సారి సమావేశానికి ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. కొత్త ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించడానికి సీనియర్ సభ్యుడ్ని ప్రొటెం స్పీకర్‌గా రాష్ట్రపతి నియమిస్తారు. అనంతరం లోక్‌సభ సభ్యులు కొత్త స్పీకర్‌ను ఎన్నుకుంటారు. స్పీకర్‌ పదవి చేపట్టే ఎంపీకి ఎటువంటి ప్రత్యేక అర్హతలు అవసరం లేదు. రాజ్యాంగం, పార్లమెంట్ నిబంధనలు గురించి అవగాహన కలిగిన వ్యక్తులు స్పీకర్ స్థానంలో ఉంటే ప్రయోజనం. గత రెండు లోక్‌సభల్లో బీజేపీకి మెజార్టీ ఉండటంతో ఆ పార్టీ ఎంపీలైన సుమిత్రా మహాజన్, ఓం బిర్లాలు స్పీకర్లుగా నియమితులయ్యారు.


అయితే, స్పీకర్ అనేది చాలా క్లిష్టమైన బాధ్యత. సభను నడిపే వ్యక్తిగా, స్పీకర్ పదవి పార్టీలకతీతంగా ఉండాలి. కానీ దానిని చేపట్టే వ్యక్తి ఒక నిర్దిష్ట పార్టీ ప్రతినిధిగా ఎన్నికలలో గెలిచిన తర్వాత పదవి స్వీకరిస్తారు. కానీ, 1967 లోక్‌సభకు స్పీకర్‌గా ఎన్నికైన వెంటనే కాంగ్రెస్‌ పార్టీతో తన మూడున్నర దశాబ్దాల అనుబంధానికి నీలం సంజీవరెడ్డి ముగింపు పలికారు. స్వచ్ఛందంగా ఆయన పార్టీ సభ్యత్వానికి ‘రాజీనామా’ చేశారు. స్పీకర్‌ అంటే అన్ని పార్టీలకు సమదూరంలో ఉంటూ సభను సజావుగా నడిపించాల్సిన వ్యక్తి అన్న భావనతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గొప్పదనం. స్వతంత్ర భారతంలో ఈ ప్రమాణాన్ని నెలకొల్పిన మొదటి లోకసభ స్పీకర్‌గా సంజీవరెడ్డి చరిత్రకెక్కారు.


ఆయన తర్వాత ఇంత వరకూ ఎవరూ తమ పార్టీకి రాజీనామా చేసిన దాఖలాలు లేవు. ఇక, 2004 నుంచి 2009 వరకూ స్పీకర్‌గా సోమనాథ్ ఛటర్జీని సీపీఎం సస్పెండ్ చేసినా ఆయన పదవిలో కొనసాగారు. 2008లో నాటి యూపీయే ప్రభుత్వంపై కమ్యూనిస్ట్‌లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా... సోమనాథ్ ఛటర్జీ పార్టీ విప్‌ను ధిక్కరించారు. చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్‌లు స్పీకర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల సంవత్సరాల్లో పార్టీలను చీల్చి, ప్రభుత్వాలు కూలిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి సందర్భాల్లో సభకు అధిపతిగా స్పీకర్ కీలక పాత్ర పోషిస్తారు. విప్‌లను ధిక్కరించే సభ్యులపై అనర్హత వేటు వేసే అధికారం ఆయనకు ఉంటుంది.


‘ఫిరాయింపు కారణంగా సభ్యులపై అనర్హత వేటు వేయాల్సి వస్తే దీనిని నిర్ణయించడంలో సభాపతి లేదా స్పీకర్‌కు సంపూర్ణ అధికారం ఉంటుంది’ అని చట్టం పేర్కొంది. నిజానికి తమ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని నితీశ్ కుమార్ గతంలోనే ఆరోపించారు. అందువల్ల తిరుగుబాట్లతో పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తే. అటువంటి వ్యూహానికి వ్యతిరేకంగా స్పీకర్ పదవిని కవచంగా మార్చుకోవచ్చినేది బాబు, నితీశ్ ఉద్దేశం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com