ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ.. సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఉదయం 11.30 గంటలకు సౌత్ బ్లాక్‌లోని ప్రధాన మంత్రి కార్యాలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు నుంచి స్వాగతం లభించింది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ.. రైతులకు సంబంధించి అంశంపైనే తొలి సంతకం చేయడం గమనార్హం. పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తూ ఆయన సంతకం చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 9.3 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం విడుదలకు ఆమోదం వేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు.
ఇక, ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. కొత్త మంత్రివర్గంతో తొలి సమావేశాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించనున్నారు. పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును క్యాబినెట్ కోరనుంది. ఈ సెషన్‌లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వ దార్శనికత, ప్రాధాన్యతలను వివరిస్తారు. మొత్తం 71 మందితో కేంద్ర మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసిన ప్రధాని మోదీ.. 30 మందికి క్యాబినెట్ ర్యాంకు, ఐదుగురికి స్వతంత్ర హోదా, 36 మంది సహాయ మంత్రుల హోదాను కట్టబెట్టారు. కేంద్ర క్యాబినెట్‌లో చేరినవారిలో మాజీ ముఖ్యమంత్రులు, తొలిసారి ఎంపీలుగా గెలిచినవాళ్లు ఉన్నారు. వీరిలో కేరళ త్రిసూర్ ఎంపీ సురేశ్ గోపి, గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మలు ఉన్నారు.
ప్రమాణస్వీకారం తర్వాత ట్విట్టర్‌లో మోదీ స్పందిస్తూ.. ‘ఈ క్యాబినెట్ యువత, అనుభవం కలబోత.. ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో మేము ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టం... 140 కోట్ల మంది భారతీయులకు సేవ చేయడానికి, భారతదేశ పురోగతి కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి మంత్రి మండలితో కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను’ అని మోదీ అన్నారు. మోదీ .30 క్యాబినెట్‌లో యూపీ నుంచి అత్యధికంగా ఏడుగురికి అవకాశం దక్కింది.