మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్రమోదీ.. తన మంత్రివర్గంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించారు. కానీ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీకి రిక్తహస్తమే మిగిలింది. దీంతో ఆ పార్టీని బీజేపీ పక్కన పెట్టిందా? అనే చర్చ సాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ పేలవ ప్రదర్శనతో అజిత్ పవార్‌ను ఉద్దేశపూర్వకంగానే బీజేపీ పక్కనబెట్టిందని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఎన్సీపీని చీల్చిన పవార్.. తన వెంట మెజార్టీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఎన్డీయేకు మద్దతు ఇచ్చారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లను మాత్రం అజిత్ దక్కించుకోకపోవడంతో మహారాష్ట్ర రాజకీయాల విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
మోదీ ప్రస్తుత క్యాబినెట్‌లో ఎన్సీపీ మినహా ఎన్డీయేలోని మిత్రపక్షాలకు అవకాశం దక్కింది. ఒక సీటు గెలుచుకున్న హిందూస్థానీ అవామీ మోర్చా అధినేత జితన్ రామ్ మాంఝీ కూడా క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. అజిత్ పవార్ వర్గానికి చెందిన ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే మంత్రి పదవి రేసులో ఉన్నప్పటికీ వారికి క్యాబినెట్‌లో చోటుదక్కలేదు. బీజేపీ ఆఫర్ చేసిన సహాయ మంత్రి (ఇండిపెండెంట్) పదవిని అజిత్ పవార్ తిరస్కరించారు. దీంతో మోదీ 3.0 కేబినెట్‌లో ఎన్సీపీకి ప్రాతినిధ్యం లేకపోయింది. ఈ చర్యలతో అజిత్ పవార్‌ను బీజేపీ పక్కనబెట్టే యోచనలో ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
ఈ పరిణామాలపై ఆజిత్ పవార్ స్పందిస్తూ.. ‘సహాయ మంత్రిగా చేరాలని ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించే హక్కు మాకు ఉందని ఆయన అన్నారు. గతంలో ప్రఫుల్ పటేల్ క్యాబినెట్ మంత్రి హోదాలో పనిచేశారు.. అందువల్ల సహాయ మంత్రిని తీసుకోవడం మాకు సముచితం కాదు’ ఆయన పేర్కొన్నారు. యూపీయే హయాంలో కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిగా ప్రఫుల్ పటేల్ బాధ్యతలు నిర్వర్తించారు. మరికొద్ది నెలల్లో పార్లమెంట్‌లో నలుగురు సభ్యులు ఉంటారని, అందువల్ల వారికి క్యాబినెట్‌లో స్థానం కల్పించాలని బీజేపీ నాయకత్వం ఎదుట తమ పార్టీ వాదించిందని ఆయన అన్నారు.
‘‘రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నడ్డాలతో సమావేశమయ్యాం. మహారాష్ట్ర లోక్‌సభ ఫలితాల గురించి మాట్లాడాం. మాకు ఒక లోక్‌సభ, రాజ్యసభ ఎంపీ ఉన్నాయి.. అయితే రాబోయే రెండు-మూడు నెలల్లో రాజ్యసభలో ముగ్గురు సభ్యులతో పాటు పార్లమెంటులో మా ఎంపీల సంఖ్య నాలుగుకు చేరుతుంది. కాబట్టి మాకు ఒక క్యాబినెట్ హోదా మంత్రి ఇవ్వాలని కోరాం.. మాకు డిమాండ్‌ను అంగీకరించకూడా బీజేపీ పెద్దలు మళ్లీ సహాయ మంత్రి తీసుకోవాలని చెప్పారు’’ అని అజిత్ వ్యాఖ్యానించారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-ఎన్సీపీ-శివసేన మహాయుతి కూటమి దారుణ ఫలితాలను సాధించింది. మొత్తం 48 స్థానాలున్న మహారాష్ట్రలో ఈ కూటమికి కేవలం 17 సీట్లు మాత్రమే దక్కాయి. 2019 ఎన్నికల్లో 23 ఎంపీలను గెలిచిన బీజేపీ.. ఈసారి 9కి పడిపోయింది. ఇక, మహావికాస్ అఘాడీ ఏకంగా 30 సీట్లలో విజయం సాధించింది. గత ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి 13 స్థానాల్లో విజయాన్ని అందుకుంది.