వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించిన వ్యక్తి మోదీయే కావడం విశేషం. కాగా, ఆదివారం రాష్ట్రపతి భవన్ వద్ద ప్రధానితో పాటు ఆయన క్యాబినెట్ ప్రమాణస్వీకారం చేసింది. మొత్తం 71 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయగా.. వీరిలో 30 మందికి క్యాబినెట్ హోదా కల్పించారు. ఐదుగురికి స్వతంత్ర హోదా, మిగిలిన 36 మంది సహాయ మంత్రులు. అయితే, 2019 క్యాబినెట్‌లోని 20 మందిని యథాతథంగా కొనసాగించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, నీటిపారుదల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ సహా హర్‌దీప్ సింగ్ పూరి, గిరిరాజ్ సింగ్, భూపేంద్ర యాదవ్, పియూష్ గోయల్, వీరేంద్ర కుమార్, కిరణ్ రిజుజులు మోదీ 2.0లో పనిచేసిన క్యాబినెట్ హోదా మంత్రులే.
క్యాబినెట్‌లో ఏడుగురు మహిళలకు ప్రాతినిధ్యం దక్కగా.. వీరిలో ఇద్దరు క్యాబినెట్ హోదా. నిర్మలా సీతారామన్‌తో పాటు గతంలో సహాయ మంత్రిగా ఉన్న అన్నపూర్ణ దేవికి క్యాబినెట్ హోదా దక్కింది. పాత మంత్రుల్లో 37 మందికి ప్రస్తుతం చోటు కల్పించలేదు. వారిలో ఏడుగురు క్యాబినెట్ హోదా, మిగిలిన 30 మంది సహాయమంత్రులు. స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకుర్, నారాయణ్ రాణె, పరుషోత్తం రూపాలా, అర్జున్ ముండా, ఆర్కే సింగ్, మహేంద్రనాథ్ పాండే మోదీ 2.0 ప్రభుత్వంలో క్యాబినెట్ హోదా మంత్రులుగా ఉన్నారు. వీరికి మోదీ 3.0 క్యాబినెట్‌లో స్థానం లభించలేదు. మంత్రి పదవి కోల్పోయినవారిలో 18 మంది ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. గత ప్రభుత్వంలో సహాయమంత్రిగా ఉండి.. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఎల్ మురగన్‌ను మోదీ క్యాబినెట్‌లో కొనసాగించారు.
2019 క్యాబినెట్‌లోని సహాయ మంత్రులు వీకే సింగ్, ఫగ్గణ్‌సింగ్ కులస్తే, అశ్వినీ చౌబే, దన్వే రావ్‌సాహెబ్ దాదారావ్, సాధ్వీ నిరంజన్ జ్యోతి, సంజీవ్ బల్యాన్, రాజీవ్ చంద్రశేఖర్, సుభాశ్ సర్కార్, నిశిత్ ప్రమాణిక్, రాజ్‌కుమార్ రంజన్ సింగ్, ప్రతిమా భౌమిక్, మీనాక్షి లేఖి, ముంజపరా మహేంద్రభాయ్, అజయ్ కుమార్ మిశ్రా, కైలాశ్ చౌధరీ, కపిల్ మోరేశ్వర్ పాటిల్, భారతీ ప్రవీణ్ పవార్, కౌశల్ కిశోర్, భగవంత్ ఖుభా, వి.మురళీధరన్, భాను ప్రతాప్‌సింగ్ వర్మ , జాన్ బార్లా, బిశ్వేశ్వర్ టుడు, భగవత్ కిషన్‌రావ్ కరాడ్, దేవుసిన్హ్ చౌహాన్, అజయ్ భట్, ఎ.నారాయణ స్వామి, సోమ్ ప్రకాశ్, రామేశ్వర్ తేలి, దర్శనా విక్రమ్ జర్దోశ్‌లను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోలేదు.
ఈసారి మంత్రివర్గంలోకి 10 మంది కొత్తవారు చేరగా.. అందులో ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. మొత్తంగా తాజా క్యాబినెట్‌లో 35 మంది పాతవాళ్లు, 36 మంది కొత్తవాళ్లు ఉన్నారు. ఎన్డీయే మిత్రపక్షాల తరఫున మంత్రులైనవారిలో టీడీపీ నుంచి కె.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, హెచ్.డి.కుమారస్వామి (జేడీఎస్), చిరాగ్ పాశ్వాన్ (ఎల్‌జేపీ-ఆర్‌వీ), జితన్‌రామ్ మాంఝీ (హెచ్‌ఏఎం-సెక్యులర్), రాజీవ్‌రంజన్ సింగ్ (జేడీయూ) తదితరులు ఉన్నారు. ఐదు మిత్ర పక్షాలకు ఒక్కో క్యాబినెట్ పదవి కట్టబెట్టారు.