ఏపీలో గత ఐదేళ్లలో ఒక్కటంటే.. ఒక్క కొత్త పరిశ్రమ కూడా వచ్చిన సందర్భమే లేదని భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ కేంద్రసహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. నేడు ఆయన ఢిల్లీ నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన భీమవరం చేరుకున్నారు. భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ మంత్రివర్గంలో తనకు అవకాశం ఇవ్వటం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదు సంవత్సరాలుగా ఒక కొత్త పరిశ్రమలు వచ్చిన సందర్భం కూడా లేదని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. కొత్త పరిశ్రమలు రాకపోగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో మనందరికీ తెలుసని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. దీనికి చక్కటి ఉదాహరణ అమర్ రాజ్ బ్యాటరీస్ అని వెల్లడించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి మనం ఒక భరోసా ఇవ్వాలన్నారు. పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకి త్వరతిగతిన అనుమతులు మంజూరు చేయాలన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న కర్ణాటక కు చెందిన కుమారస్వామి సహకారంతో ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామని భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు.