ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మంగళవారం ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. శాసన సభ పక్ష నేత ఎంపికపై చర్చలు జరుపుతున్నారు. అధిష్టానం ప్రకటనకు అందరూ కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. అనంతరం పురందేశ్వరి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కూటమి సమావేశం జరుగుతున్న ఎ కన్వెన్షన్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు కూటమిపై విశ్వాసంతో మంచి విజయం అందించారని అన్నారు. ప్రజలు ఇచ్చిన భరోసాను తమ పని తీరుతో నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. శాసనసభ పక్ష సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు వివరిస్తామన్నారు. బుధవారం చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా వస్తున్నారని, రాష్ట్ర బీజేపీ పక్షాన రేపు తామంతా ఆ సభలో పాల్గొంటామని పురందేశ్వరి పేర్కొన్నారు. కాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును టీడీఎల్పీ నేతగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు ప్రతిపాదన చేయనున్నారు. అలాగే ఎన్డీఏ పక్షాల తరపున ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రతిపాధించనున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దీనిని బలపరచనున్నారు.