రాష్ట్రంలో కొత్తప్రభుత్వం ఏర్పడుతుండడంతో త్వరలోనే తమ కార్మికుల సమస్య సమసిపోయే అవకాశాలు ఉన్నాయని విజయనగరం జిల్లా, కొత్తవలస మండంలోని అప్పన్నపాలెం పంచాయతీ జింధాల్ నగర్‌లో నున్న జేఎస్‌ఎల్ కర్మాగారానికి చెందిన వివిద కార్మిక సంఘాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం కర్మాగారం ఎదుట నిరసన చేస్తున్న కార్మికులను ఉద్దేశించి వైసీపీ కార్మిక సంఘం నాయకుడు కోన దేముడు, టీఎన్‌టీయూసీ కార్మిక సంఘం నాయకులు పిల్లా అప్పలరాజు, సలాది బీమయ్య, సీఐటీయూ కార్మిక సంఘం నాయకుడు నమ్మి చినబాబు, బాలిబోని ఈశ్వరరావు మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తప్రభుత్వం కొలువు తీరనున్నందున కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు పూర్తయిన వెంటనే విశాఖపార్లమెంటరి నియోజకవర్గం నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఎన్నికైన ఎం.భరత్, శృంగవరపుకోట శాసన సభ్యురాలు కోళ్ల లలిత కుమారి శిబిరానికి వచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికులు గొంతెమ్మ కోరికలేవీ కోరడం లేదని, లాకౌట్ వేసినందున కార్మికులందరికీ లే ఆఫ్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. యాజమాన్యం మరోసారి రెగ్యులర్ ఎంప్లాయిస్ కార్మికులు, కాంట్రాక్టు కార్మికులని విభజిస్తూ బహిరంగ లేఖను విడుదల చేయడం పట్ల కార్మిక సంఘాల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికులని చెబుతూ తమ పనిదినాలు నష్టపోకుండా జాజ్‌పూర్ కర్మాగారానికి వెళ్లి పని చేసుకోవాలని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇక్కడ నుంచి అక్కడకు వెళితే అక్కడ భాషరాదు, అక్కడ ఆహార అలవాట్లు వేరుగా ఉంటాయి, వసతి సౌకర్యం ఉంటుందో ఉండదో తెలియదు ఎలా వెళ్లి పోమంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలోను, కేంద్రంలోను కొత్తగా కొలువుదీరే ప్రభుత్వమే తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు, కార్మికులు పాల్గొన్నారు.