గిరిజన నేత మోహన్ చరణ మాఝి ఒడిశా ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఒడిశాకు తొలి బీజేపీ సీఎంగా మాఝీ రికార్డుల్లోకి ఎక్కారు. అలాగే, పాటు డిప్యూటీ సీఎంలుగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బొలంగీర్ రాజ వంశానికి చెందిన కనక్ వర్ధన్ సింగ్‌దేవ్, తొలిసారి ఎమ్మెల్యే అయిన ప్రవతి పరీదాలతో గవర్నర్ ప్రమాణం చేయించారు. ప్రవతి పరీదా ఒడిశాకు తొలి మహిళా ఉపముఖ్యమంత్రి. గతంలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేత హేమానంద బిస్వాల్, గిరిధర్ గమాంగ్‌లు ఒడిశా సీఎంలుగా వ్యవహరించారు. వారి తర్వాత ఇప్పుడు మాఝి సీఎం అయ్యారు.
భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. అలాగే, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌కు సైతం ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావడం విశేషం. వరుసగా ఐదుసార్లు సీఎంగా పనిచేసిన నవీన్ పట్నాయక్.. ఈ వేడుకలో పాల్గొని, బీజేపీ అగ్రనేతలతో కలిసి వేదికను పంచుకోవడం చెప్పుకోదగ్గ అంశం. ప్రమాణస్వీకారోత్సవం పూర్తయిన తర్వాత ప్రధాని మోదీ నేరుగా నవీన్ పట్నాయక్ వద్దకు వెళ్లి కరచాలనం చేసి కాసేపు ముచ్చటించారు. తర్వాత సీఎం సహా మంత్రులందరూ నవీన్ పట్నాయక్‌తో కరచాలనం చేశారు.
అయితే, ఈ సంప్రదాయం ఆంధ్రప్రదేశ్‌లో కనిపించకపోవడం గమనార్హం. నవ్యాంధ్రకు తొలి సీఎంగా 2014లో చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసినప్పుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకాలేదు. అలాగే, 2019లో వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి చంద్రబాబు రాలేదు. తాజాగా, చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా.. ఇప్పుడు కూడా జగన్ హాజరవ్వలేదు.