జమ్మూ కశ్మీర్‌లో మూడు రోజుల్లో మూడోసారి ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఆదివారం రియాసీ జిల్లాలో శివఖోరి ఆలయానికి వెళ్లి వస్తోన్న యాత్రికుల బస్సుపై ముష్కరులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో బస్సు లోయలో పడి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రాత్రి కథువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని సైదా సుఖల్ గ్రామంలో కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించి తాజాగా దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామంలోకి చొరబడిన ఉగ్రవాదులు.. దాడికి కొద్ది క్షణాల ముందు ఇంటింటికి వెళ్లి తాగడానికి నీళ్లు అడిగినట్టు పోలీసులు తెలిపారు. కానీ, అనుమానించిన గ్రామస్థులు వారి ముఖాలపైనే తలుపులు వేశారని పేర్కొన్నారు.
కథువా దాడిలో పాల్గొన్న ఇద్దరు ముష్కరుల్లో ఒకర్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సోమవారం రాత్రి మొదలైన ఎన్‌కౌంటర్ మంగళవారం ఉదయం వరకూ కొనసాగింది. ఉగ్రవాదులతో జరిగిన పోరులో ఓ జవాన్ అమరుడయ్యాడు. కథువాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తోన్న జమ్మూ జోన్ అదనపు డీజీపీ ఆనంద్ జైన్ మాట్లాడుతూ.. సైదా సుఖల్ గ్రామంలోకి తొలుత ఉగ్రవాదులు ప్రవేశించారని పేర్కొన్నారు.
‘‘గ్రామంలోకి చొరబడిన ఉగ్రవాదులు కొన్ని ఇళ్లకు వెళ్లి నీళ్లు కావాలని అడిగారు.. వారి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో నీళ్లు ఇవ్వకుండా ముఖాలపైనే తలుపులు మూశారు.. కొందరు భయంతో కేకలు వేశారు.. దీంతో తీవ్రవాదులు భయాందోళనకు గురై, గాలిలోకి యాదృచ్ఛికంగా కాల్పులు జరిపారు.. అటుగా వెళుతున్న ఒక గ్రామస్థుడిపై కూడా కాల్పులు జరిపారు.’’ అని తెలిపారు.
‘సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడకు చేరుకుని ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.. ఆ సమయంలో సైన్యంపైకి గ్రనేడ్ విసరడానికి ప్రయత్నించిన ఉగ్రవాదిని కాల్చి చంపారు.. మరో ముష్కరుడి కోసం గ్రామంలోని ఒక్కో ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు’ అని పేర్కొన్నారు. కాల్పుల్లో గాయపడిన స్థానిక పౌరుడు ఓంకార్ నాథ్, అతడి భార్యను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. అంతేకాదు, ఉగ్రవాదుల కాల్పుల్లో పలువురు చనిపోయారని జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.
ఇక, మంగళవారం రాత్రి దోడా జిల్లాలోని సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన తాత్కాలిక చెక్‌పోస్ట్‌పై తీవ్రవాదులు కాల్పులు జరిపినట్టు ఏడీజీపీ తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు, ఓ ప్రత్యేక పోలీస్ అధికారి గాయపడ్డారని, చికిత్స కోసం వారిని ఆస్పత్రికి తరలించామని వివరించారు. ఇంకా, ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు.