ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు.. తన టీమ్‌ను సైతం సిద్ధం చేసుకున్నారు. మంత్రులకు సైతం శాఖలు కేటాయించారు. అయితే మంత్రివర్గ ఏర్పాటు, శాఖల కేటాయింపులో .. వాలంటీర్లకు టీడీపీ ప్రభుత్వం పరోక్షంగా శుభవార్త అందించింది. 24 మందికి శాఖలను కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సచివాలయం, గ్రామ వాలంటీర్ శాఖను ఏర్పాటు చేసి ఓ మంత్రిని సైతం ఏర్పాటు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయస్వామిని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా నియమించిన చంద్రబాబు నాయుడు.. ఆయనకు సచివాలయం, గ్రామ వాలంటీర్ బాధ్యతలు కూడా అప్పగించారు.
మరోవైపు వైసీపీ హయాంలో వైఎస్ జగన్.. ఇంటింటికీ సంక్షేమాన్ని అందజేయాలనే సంకల్పంతో.. గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. సచివాలయాలకు ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలను చేపట్టిన ప్రభుత్వం.. ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమించింది. వారి ద్వారానే పింఛన్ సహా నగదు లబ్ధిని అందిస్తూ వచ్చారు. అయితే ఎన్నికల సమయంలో కోడ్ కారణంగా వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమం లబ్ధిని అందించేందుకు వీలు లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలాగే ప్రచారానికి సైతం వారు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. దీంతో పలువురు వాలంటీర్లు.. తమ పదవులకు రాజీనామా చేశారు.
ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 1,08,273 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వీరంతా వైసీపీ తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లపై విమర్శలు గుప్పించిన టీడీపీ నేతలు.. ఎన్నికల ప్రచారం సమయంలో వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అలాగే కూటమి అధికారంలోకి వస్తే పదివేలు జీతంగా ఇస్తామని ప్రచారం చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా అనే సందేహాలు సైతం వ్యక్తమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి తోడు మంత్రులకు శాఖల కేటాయింపు సమయంలో చంద్రబాబు నాయుడు సచివాలయం, గ్రామ వాలంటీర్ పేరిట ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి.. ఈ బాధ్యతలను డోల బాల వీరాంజనేయ స్వామికి కేటాయించడం విశేషం. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని స్పష్టత వచ్చింది.