ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువు దీరింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కూడా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు వంటి ఫైళ్లపై సంతకాలు చేసి పాలన మొదలెట్టారు. అయితే బాధ్యతల స్వీకరణ తర్వాత ఏపీలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అప్రజాస్వామ్యంగా వ్యవహరించారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వారంతా తీరు మార్చుకోవాలంటూ హితబోధ చేశారు. అయితే ఈ క్రమంలోనే ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి బొకే ఇస్తే చంద్రబాబు తీసుకోవడానికి తిరస్కరించారనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి కూడా బొకేను అందించారు. దానిని అలా చేతులతో టచ్ చేసిన చంద్రబాబు.. ఆ తర్వాత తిరిగి వెనక్కి ఇచ్చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే శ్రీలక్ష్మి సహా అధికారులు ఇచ్చిన బొకేలను చంద్రబాబు తీసుకోలేదు. వారితో ఫోటో దిగి తర్వాత వారి చేతుల్లోనే వదిలేశారు. ఈ రకంగానే శ్రీలక్ష్మి అందించిన పుష్పగుచ్ఛాన్ని తిరిగి ఆమెకే ఇచ్చేశారనే వారూ ఉన్నారు. అయితే ఈ ఘటనతో శ్రీలక్ష్మి మరోసారి వార్తల్లో నిలిచారు.
తెలంగాణ క్యాడర్‌కు చెందిన శ్రీలక్ష్మి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అయితే శ్రీలక్ష్మి కెరీర్‌లో వివాదాలు ఉన్నాయి. ఓబుళాపురం మైనింగ్ కుంభకోణంలో శ్రీలక్ష్మిపై ఆరోపణలు వచ్చాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా పనిచేసిన శ్రీలక్ష్మి.. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.