ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మంత్రులకు శాఖలు కేటాయించారు. బుధవారం విజయవాడలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలోనే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారం పూర్తై రెండు రోజులు గడుస్తున్నప్పటికీ.. మంత్రులకు శాఖల కేటాయింపులో జాప్యం జరిగింది. గురువారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. అనంతరం మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రికే మంత్రులకు శాఖల కేటాయింపుపై ప్రకటన వస్తుందని అందరూ ఎదురు చూశారు. అయితే శుక్రవారం మధ్యాహ్నానికి ప్రకటన విడుదల అయ్యింది.
ఇక చంద్రబాబు మంత్రివర్గంలో జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కిన విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లకు మంత్రి పదవులు వరించాయి. ఇక పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. నాదెండ్ల మనోహర్‌ను ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రిగా నియమించారు. నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్‌ను పర్యాటకం, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ దక్కింది.
పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి తిరుగులేని మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70 వేల పైచిలుకు మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్.. తొలిసారిగా అసెంబ్లీలోకి డిప్యూటీ సీఎం హోదాలో అడుగుపెట్టనున్నారు. ఇక నాదెండ్ల మనోహర్ విషయానికి వస్తే.. ఆయనకు పౌర సరఫరాలశాఖ కేటాయిస్తారంటూ ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు అనుగుణంగానే ఆయనకు ఆహారం, పౌరసరఫరాల శాఖ దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాదెండ్ల మనోహర్.. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున తెనాలిలో పోటీచేసి గెలుపొందారు.
2011లో శాసనసభ స్పీకర్‌గా వ్యవహరించారు నాదెండ్ల మనోహర్. 2014లో హస్తం పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయిన ఆయన.. 2018లో జనసేనలో చేరి అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారు. 2024 ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీచేసిన నాదెండ్ల మనోహర్.. వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ మీద 48 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పౌరసరఫరాలు, ఆహారశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
జనసేన నుంచి మూడో మంత్రి పదవి నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్‌ను వరించింది. ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ నియమితులయ్యారు. కాంగ్రెస్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కందుల దుర్గేష్.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా పనిచేశారు.2014 ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ నుంచి కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. అక్కడి నుంచి జనసేనలోకి వచ్చిన కందుల దుర్గేష్.. 2019 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో నిడదవోలు నుంచి పోటీచేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే.. మంత్రిపదవి చేపట్టారు.