2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ నేతలు, మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత సైలెంట్ అయిన నేతలు.. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునే పనిలో పడ్డారు. కేవలం 11 సీట్లకే పరిమితం కావడం మీద.. నియోజకవర్గాలలో విశ్లేషణలు చేస్తున్నారు. తాజా మాజీ మంత్రి ఆర్కే రోజా.. వైసీపీ ఓటమిపై స్పందించారు. ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిన రోజా.. నగరిలో తన ఓటమి, రాష్ట్రంలో వైసీపీ పరాజయంపైనా ట్వీట్ చేశారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల కానీ.. మంచి చేసి ఓడిపోయాం. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం.. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అంటూ కార్యకర్తలలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.
మరోవైపు ఎన్నికలకు ముందు నుంచి నగరిలో రోజా ఓడిపోతారంటూ ప్రచారం జరిగింది. వైసీపీ ఓడిపోయే మొదటి సీటు నగరేనంటూ చాలా మంది వ్యాఖ్యలు చేశారు. అలాగే పలు సర్వేలు కూడా నగరిలో రోజా ఓటమి ఖాయమంటూ అంచనా వేశాయి. అయితే రోజా మీద నమ్మకం ఉంచిన వైఎస్ జగన్.. మరోసారి ఆమెకే టికెట్ కేటాయించారు. అయితే నియోజకవర్గంలో తన కుటుంబం మీద ఉన్న వ్యతిరేకతకు తోడు.. వైసీపీలోని మరో వర్గం తిరుగుబావుటా ఎగరేయటంతో నగరిలో ఆర్కే రోజా ఘోర పరాజయం పాలయ్యారు. టీడీపీ అభ్యర్ధి గాలి భాను ప్రకాష్ చేతిలో 45 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.
మరోవైపు రోజా సోదరులపై వచ్చిన అవినీతి ఆరోపణలు తోడు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద రోజా చేసిన వ్యక్తిగత విమర్శలు కూడా ఆమె ఓటమికి కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు మీద 858 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు రోజా. ఇక 2019 ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ మీద 2,708 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. అయితే 2024 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకున్న రోజా ఆశలపై వైసీపీలోని కేజే శాంతి వర్గంతో పాటు, ఓటర్లు కూడా నీళ్లు చల్లారు. దీంతో రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి సైలెంట్ మోడ్‌లో ఉన్న రోజా.. తొలిసారిగా ట్వీట్ చేశారు.
ఎన్నికల ఫలితాల తర్వాత ఆర్కే రోజా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతారంటూ ప్రచారం జరిగింది. తిరిగి సినిమాల్లో నటిస్తారని.. రాజకీయాలకు దూరంగా ఉంటారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ ట్వీట్ ద్వారా అలాంటి వార్తలు, వదంతులకు రోజా చెక్ పెట్టారని చెప్పొచ్చు.