పిడుగు పడి ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆదివారం కర్నూలు జిల్లా, తుగ్గలి మండల పరిధిలోని రామలింగాయపల్లె, చెన్నంపల్లి తదితర గ్రామాల్లో సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గొర్రెలను తోలుకొని ఇంటికి చేరుకుంటుండగా చెన్నంపల్లి చెరువులో పిడుగు పడింది. దీంతో గొర్రెల కాపరులు ఎరుకుల కామేశ్వరి (33), సుంకన్న (40) మృతి చెందారు. ఈశ్వరయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. అతనితోపాటు ఉన్న భార్య సంధ్య క్షేమంగా బయటపడింది. అయితే.. దాదాపు 600 గొర్రెలు కనిపించకుండాపోయాయి. సుంకన్న మృతితో భార్య వెంకటమ్మ, ఇద్దరు కొడుకులు బోరున విలపించారు. ఎరుకుల కామేశ్వరి మృతి చెందడంతో ఆమె భర్త ఎరుకుల సుంకన్న, ఇద్దరు పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్తిన వెంకట్రాముడు, టీడీపీ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకటపతి, మాబాషాలు సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు.