మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ శానిటరీ విభాగంలో 450 మందికిపైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్‌లలో కార్మికుల విధులకు సంబంధించి హాజరును సచివాలయాల్లో పనిచేసే శానిటరీ విభాగం సెక్రటరీలు ప్రతినెలా తయారు చేసి మునిసిపల్ కార్యాలయానికి పంపుతారు. వీటి ఆధారంగా కార్మికులకు జీతాల చెల్లింపు చేసే పనిని ఈ ఇద్దరు అసిస్టెంట్ శానిటరీ ఇనస్టెక్లర్లు చేస్తుంటారు. కార్మికులు వివిధ కారణాలతో విధులకు హాజరుకాకున్నా హాజరైనట్లుగా చూపి పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించడంలో ఈ ఇద్దరు ఉద్యోగులు గుట్టుచప్పుడు కాకుండా తమపని చేసుకుపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కార్మికులు నెలలో పదిరోజుల పాటు విధులకు హాజరుకాకున్నా హజరైనట్లుగా చూపుతామని, ఈ పది రోజుల జీతంలో ఐదురోజుల జీతాన్ని మాకు ఇవ్వాలని ఇద్దరు అసిస్టెంట్ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కార్మికుల నుంచి బేరం కుదుర్చుకుని వసూలు చేసుకుంటున్నారని, ఈ అంశం బహిరంగ రహస్యమని కార్యాలయ ఉద్యోగుల బాహాటంగానే చెప్పుకుంటున్నారు. 450 మందికిపైగా కార్మికుల జీతాల చెల్లింపులో తిమ్మినిబమ్మిని చేసి ఈ తరహాలో కనీసంగా నెలకు రెండు లక్షల రూపాయలను వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇంతా జరుగుతున్నా కార్యాలయ అధికారులు ఈ అంశంపై దృష్టి సారించడంలేదని, దీంతో ప్రజాధనం పక్కదారి పడుతోందని కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు అంటున్నారు.