ఈనెల 19న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 19న ఉదయం 10:30గంటలకు తాడేపల్లిక్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలతో సహా ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులందరికీ ఇప్పటికే ఆహ్వానం పంపారు. నలుగురు ఎంపీలు మినహా పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు కూడా ఆహ్వానం పంపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన అభ్యర్థులతో జగన్ అధికారికంగా సమావేశం కావడం ఇదే తొలిసారి. వారం రోజుల క్రితం శాసన మండలి సభ్యులతోనూ ఆయన సమావేశమై వారికి దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. అలాగే పార్టీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన అభ్యర్థులతోనూ సమావేశమై తదుపరి కార్యచరణపై వారితో చర్చించనున్నారు. రాష్ట్రంలో కేవలం 11సీట్లకే పరిమితం కావడంపై సుదీర్ఘ చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఓటమికి గల కారణాలపై చర్చించి, అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలో జగన్ వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.