ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3వ తేదీ వరకూ బుధవారంనాడు పొడిగించింది. ఆయనతో పాటు కేసులో మరో నిందితుడు వినోద్ చౌహాన్ జ్యుడిషియల్ కస్టడీని సైతం జూలై 3 వరకూ కోర్టు పొడిగించింది. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఇరువురిని కోర్టు ముందు హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవినీతి ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అరెస్టు చేసింది. గోవా ఎన్నికల కోసం బీఆర్ఎస్ నేత కె.కవిత నుంచి అభిషేక్ బోయనపల్లి ద్వారా రూ.25 కోట్లు వినోద్ చౌహాన్ అందుకున్నట్టు ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నెలాఖరులోగా వినోద్ చౌహాన్‌పై ప్రాసిక్యూషన్ కంప్లయింట్ నమోదు చేయనున్నట్టు చెప్పారు. వినోద్ చౌహాన్‌ను మేలో అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం కేజ్రీవాల్ చేసుకున్న దరఖాస్తుతోనూ ఈడీ విభేదిస్తోంది. తీవ్రమైన ఆర్థిక నేరాలతో కేజ్రీవాల్‌కు సంబంధాలున్నట్టు తగినన్ని సాక్ష్యాలున్నాయని చెబుతోంది.