పదవీ విరమణ తర్వాత కూడా శాఖల్లో కొనసాగుతున్న వైసీపీ సిబ్బందిపై వేటు పడింది. వారందరినీ వెంటనే తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల దృష్టా రిటైర్ అయిన ఉద్యోగులను ఆయా శాఖల్లో కొనసాగించింది. వందల మంది ఉద్యోగులు తమ శాఖలను విడిచిపెట్టకుండా, పదవీ విమరణ తర్వాత కూడా అక్కడే తిష్ఠవేశారు. కొంతమంది ఇంటి వద్దనే ఉంటూనే, వివిధస్థాయుల్లో పోస్టింగ్‌లు తీసుకుని జీతాలు డ్రా చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. వారందరినీ తొలగిస్తూ గురువారం మధ్యాహ్నానికల్లా సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై అన్ని శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, హెచ్‌వోడీలకు ఆయన ఆదేశాలిచ్చారు. ఇప్పటికే రిటైర్ అయి రీఎంప్లాయిమెంట్ కింద శాఖల్లో కొనసాగుతున్న వారందరి దగ్గర నుంచి వెంటనే రాజీనామా లేఖలు తీసుకోవాలని, ఆ వెంటనే వాటిని ఆమోదించాలని స్పష్టం చేశారు. ఆయా శాఖల్లో ఎవరెవరిని తొలగించాలనేది ఈ నెల 24లోగా సాధారణ పరిపాలన విభాగానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అదే సమయంలో శాఖల్లో ఆయా ఉద్యోగుల సేవలు అవసరం అనుకుంటే ప్రభుత్వం అనుమతితో తిరిగి నియమించుకోవాలని సూచించారు. వారికి కొత్తగా అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.