గత ప్రభుత్వంలో రాజధాని అమరావతి విధ్వంసానికి గురైందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. అమరావతిని అన్ని రకాలుగా దెబ్బతీసే ప్రయత్నం చేశారన్నారు. ఒకవైపు విధ్వంసం, నిర్వీర్యం చేస్తూనే మరోవైపు అపహాస్యం చేశారని వ్యాఖ్యానించారు. చివరికి రాజధానిలోని భవనాల్లో తలుపులు పగలగొట్టించి అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చారని మండిపడ్డారు. గురువారం రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాలుగు గంటలపాటు విస్తృతంగా పర్యటించారు. చంద్రబాబు కూలిన ప్రజావేదిక ప్రాంతంలో మొదలుపెట్టి రాజధాని ప్రాంతంలోని అన్ని భవన నిర్మాణ సముదాయాలను పరిశీలించారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్డులో రైతుల సమక్షంలో మీడియాతో మాట్లాడారు. ‘‘అమరావతి మనకు చిరునామా లాంటిది. ఐదు కోట్ల మంది దిశ దశను నిర్ధారించే రాజధాని ఇది. ఉద్యోగం, ఉపాధి కోసం చెన్నై, బెంగళూరు నగరాలకు తరలిపోకుండా సగర్వంగా మా రాజధాని అని చెప్పుకొనే నగరం. మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారు. ఏ ముఖ్యమంత్రి అయినా మంచి పనితో పాలన ప్రారంభిస్తారు. కానీ జగన్ ప్రజావేదిక కూల్చివేతతో పరిపాలన మొదలుపెట్టారు. అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీయాలని విషం జల్లే ప్రయత్నాలు చేశారు. ఐదేళ్ల కిందట వేసిన మట్టి అక్కడే ఉంది. చివరికి రాజధాని నిర్మాణానికి తీసుకొచ్చిన పైపులు, ఇసుక, రోడ్డు కంకర కూడా దొంగలించారు. ఒక్క భవనాన్ని కూడా పూర్తిచేసే ఆలోచన చేయలేదు. మొత్తం తిరిగి చూశాక నాకే ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి వచ్చింది. రోడ్లు మధ్యలోనే ఆగిపోయాయి. అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదయాలు నిలిచిపోయాయి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చూస్తే బాధ కలిగింది. రాష్ట్రం, దేశం, ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రార్థనాలయాలు, పవిత్ర నదుల నుంచి పవిత్ర మట్టి, జలాలు తీసుకొచ్చి శంకుస్థాపన చేశాం. ప్రధాని మోదీ పార్లమెంటులోని మట్టితో పాటు యమునా నదీ జలాలు తీసుకొచ్చారు. ఎంత విధ్వంసం చేయాలని ప్రయత్నించినా ఆ మహిమే ఈరోజు రాజధానిని కాపాడింది.’’ అని చంద్రబాబు తెలిపారు.