ఖరీఫ్ సాగుకు రైతులు సమాయత్తం అవుతున్న నేపధ్యంలో పంట కాల్వలు ముందుగానే మరమ్మతులు చేయాలని బాపట్ల కలెక్టర్ పి.రంజిత్‌బాషా తెలిపారు. జలవనరులు, పంటకాల్వలు, వ్యవసాయ అనుబంధశాఖల అధికారులతో శుక్రవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు ప్రారంభమైన నేపధ్యంలో రైతులు సమాయత్తం అవుతున్నారన్నారు. వారికి అవసరమైన విత్తనాలు, ఎరువులు పంపిణి చేయటానికి సిద్దంగా ఉంచాలన్నారు. రైతు పొలంలోనే మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు చేయాలని ఆదేశించారు. ఖరీఫ్ సీజన్‌లో 1,41,916 ఎకరాలలో పంటలసాగుకు రైతులు సిద్దంగా ఉన్నారన్నారు. ఈ మేరకు వ్యవసాయశాఖాధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం 1,045 క్వింటాళ్ళ పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు ఆయా మండలాలలో సిద్ధంగా ఉంచామన్నారు. జిల్లా పరిధిలోని పంట కాల్వలకు 154 మరమ్మతుపనులు చేపట్టాలని ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. వీటికి సుమారు 13.43 కోట్ల రూపాయల నిధులు కావాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. అధికారికంగా మంజూరు కాగానే పనులు ప్రారంభించాలన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు పని చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ వై.రామకృష్ణ, కె.శ్రీనివాసరావు, జలవనరులశాఖ ఎస్‌ఈ ఉమామహేశ్వరరావు, కృష్ణా, పశ్చిమ డెల్టా ఈఈ మురళీకృష్ణ, ఉద్యానవన శాఖ ఏడీ జెన్నెమ్మ పాల్గొన్నారు.