గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో నిర్మిస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యాలయ భవనాన్ని అధికారులు కూల్చివేశారు. తాడేపల్లి మండలం సీతానగరంలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం కోసం భవనాన్ని నిర్మిస్తున్నారు.. అయితే నీటి పారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టారనే కారణంతో కూల్చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయం కోసం బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో అప్పటి జగన్ సర్కార్ కేటాయించింది. ఈ నిర్మాణం అక్రమం అంటూ వైఎస్సార్‌సీపీకి సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది.. అయితే శనివారం ఉదయం అధికారులు ఆ భవనాన్ని కూల్చివేశారు.
భవనం కూల్చివేతపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. 'ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైఎస్సార్‌సీపీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను' అంటూ ట్వీట్ చేశారు.
తాడేపల్లిలో 202/A1 సర్వే నంబర్లోని 2 ఎకరాల భూమిని పార్టీ కార్యాలయానికి గత జగన్ ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ స్థలం స్వాధీనానికి ఇరిగేషన్ శాఖ అంగీకరించలేదని చెబుతున్నారు.. సీఆర్డీఏ, ఎంటీఎంఈ, రెవెన్యూ శాఖలు ఈ భూమిని వైఎస్సార్‌సీపీకి అప్పగించలేదని చెబుతున్నారు. అంతేకాదు వైఎస్సార్‌సీపీ కార్యాలయ భవన నిర్మాణానికి కనీసం ప్లాన్ కోసం కూడా దరఖాస్తు చేయలేదంటున్నారు అధికారులు. నీటిపారుదల శాఖ భూమిలో ఇలా అక్రమంగా ఒక్క అనుమతి లేకుండా కార్యాలయ నిర్మాణం చేపట్టారంటున్నారు.
వైఎస్సార్‌సీపీ ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టిందని.. గుంటూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఈ వైఎస్సార్‌సీపీ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ, ఎంటీఎంసీ కమిషనర్లను కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు.. ఎంటీఎంసీ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేశారు.
మరోవైపు వైఎస్సార్‌సీపీ కార్యాలయం కూల్చివేత అంశంపై హైకోర్టులో కూడా విచారణ జరిగింది. తమ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసేందుకు సీఆర్డీఏ ప్రయత్నిస్తోందంటూ వైఎస్సార్‌సీపీ హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టగా.. తుది ఉత్తర్వులివ్వకుండా కూల్చివేతకు చర్యలు చేపడుతున్నారని వైఎస్సార్‌సీపీ తరఫున సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ భవనం విషయంలో చట్ట నిబంధనలను పాటించాలని సీఆర్డీఏను హైకోర్టు ఆదేశించింది.