ఆంధ్రప్రదేశ్ 16వ అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే (నర్సీపట్నం) చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే నామినేషన్ దాఖలైనందున అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆయన ఎన్నికను సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ అయ్యన్నపాత్రుడ్ని స్పీకర్ స్థానంలో కూర్చుండబెట్టారు.. ఆయన్ను అభినందించారు.
అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్న ఒకరన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని.. యువత రాజకీయాల్లోకి రావాలని ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుతో 25 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారని..ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు అన్నారు.
అయ్యన్నపాత్రుడు గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడ్డారని.. అయ్యన్నపాత్రుడుపై 20కు పైగా కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. అయ్యన్నపాత్రుడిపై అత్యాచారం కేసు పెట్టడం దారుణమన్నారు. గత ఐదేళ్లుగా శాసనసభలో జరిగిన సంఘటనలు చూసి బాధపడ్డానన్నారు. గత సభలో అసెంబ్లీని వాకౌట్ చేసేటప్పుడు చేసిన తాను చేసిన వ్యాఖ్యల్ని చంద్రబాబు గుర్తు చేశారు. కౌరవ సభలో తాను ఉండనని.. ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని చెప్పానని.. తన కుటుంబ సభ్యులపై వైఎస్సార్‌సీపీ సభ్యులు అమర్యాదగా మాట్లాడారన్నారు. గత పాలనలో ఎంతోమంది మహిళలు బాధపడ్డారన్నారు.
గౌరవసభగా శాసనసభను నడిపిస్తానని ప్రజలకు మాట ఇచ్చానన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు వైసీపీ పాలనలో జరిగిన అవమానం ఇంకెప్పుడూ ఈ సభలో జరగకూడదని.. తనకు మరో జన్మఅంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని కోరుకుంటున్నానన్నారు. అవతలి పార్టీ సభ్యులను ఎగతాళి చేయాల్సిన అవసరం లేదని.. వైఎస్సార్‌సీపీ సభ్యులను సభలో గౌరవించాలన్నారు. గతంలో టీడీపీకి 23 సీట్లు వచ్చాయని ఎగతాళిగా మాట్లాడారని.. కానీ ఈసారి మాత్రం సభలో సభ్యులంతా హుందాగా వ్యవహరించాలన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధిపై దృష్టిపెట్టాలని.. నిర్ధేశిత సయంలో అభివృద్ధి పనులు పూర్తిచేయాలన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రతి సభ్యుడు పనిచేయాలన్నారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్‌గా రావడం సంతోషంగా ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇన్ని దశాబ్దాల్లో ప్రజలు అయ్యన్నపాత్రుడు ఘాటైన వాగ్ధాటి, వాడి వేడి చూశారని.. ఇవాళ్టి నుంచి రాష్ట్ర ప్రజలు ఆయన హుందాతనాన్ని కూడా చూస్తారన్నారు. గత ప్రభుత్వంలో వ్యక్తిగత దూషణలు చాలా ఇబ్బంది పెట్టాయని.. భాష మనసులను కలపడానికి.. విడగొట్టడానికి కాదన్నారు. భాష విద్వేషం రేపడానికి కాదు.. పరిష్కరించడానికి అన్నారు. ఎంత జఠిల సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవ్చని.. గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసిందన్నారు. ప్రతి అడుగు భవిష్యత్తు తరతరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు.
చింతకాయల అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు నలబై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. పదిసార్లు నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఏడుసార్లు విజయం సాధించారు.. ఒకసారి ఎంపీగా గెలిచారు. ఇప్పటివరకూ ఐదు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. ఈసారి ఆయనకు అసెంబ్లీ స్పీకర్‌గా అవకాశం దక్కింది.