ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధాని విషయంలో క్లారిటీ వచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించటంతో.. రాజధాని అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వడం మొదలైంది. ఈ క్రమంలోనే వైష్ణవి అనే వైద్య విద్యార్థిని రాజధాని నిర్మాణం కోసం రూ.25 లక్షలు విరాళం అందించారు. అలాగే పోలవరం కోసం లక్ష రూపాయలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి విరాళం తాలుకూ చెక్‌లను అందజేశారు. ఇందుకోసం తన పొలాన్ని అమ్మి మరీ.. విరాళం అందజేయడం విశేషం.
ఏలూరు జిల్లా, ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి విజయవాడలోని ఓ మెడికల్ కాలేజిలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్నారు. అయితే నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి ఉండాలని వైష్ణవి తపించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అధికారంలోకి రావటంతో.. అమరావతి నిర్మాణానికి తన వంతు సహాయం అందించాలని వైష్ణవి నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తమకు ఉన్న మూడు ఎకరాల భూమిలో ఎకరా అమ్మేసిన వైష్ణవి కుటుంబం.. రూ.25 లక్షలు పోగు జేసింది. అలాగే పోలవరం నిర్మాణానికి సైతం అండగా నిలిచేందుకు తనకున్న బంగారు గాజులు అమ్మేసి మరో లక్షను వైష్ణవి సమీకరించారు ఈ మొత్తానికి సంబంధించి చెక్కులను శనివారం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడుని అందించారు.
ఈ సందర్భంగా వైష్ణవిని సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. అమరావతి నిర్మాణం కోసం పొలం అమ్మి మరీ విరాళం అందజేయడం గొప్ప విషయమంటూ కొనియాడారు. వైష్ణవి నేటి యువతకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందన్న చంద్రబాబు.. ఇలాంటి యువత కలలను తమ ప్రభుత్వం నిజం చేస్తుందని అన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప మనసు చాటిన వైద్య విద్యార్థిని వైష్ణవి చంద్రబాబు శాలువాతో సత్కరించారు. అలాగే అమరావతికి బ్రాండ్ అంబాసిడర్‌గా వైష్ణవిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. వైష్ణవితో పాటుగా ఆమె తండ్రి అంబుల మనోజ్‌ను చంద్రబాబు అభినందించారు.