ఉద్యోగుల సమయపాలనకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఆఫీసుకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం కొరడా ఝులిపించింది. నిర్దేశిత సమయానికి మించి గరిష్టంగా పావుగంట మాత్రమే అనుమతి ఉంటుందని, దేశవ్యాప్తంగా ఉద్యోగులు ఉదయం 9.15 గంటల్లోపు కార్యాలయాలకు వచ్చి, హాజరు వేయాల్సిందేనని స్పష్టం చేసింది. సీనియర్ అధికారులు సహా ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలుచేయాలని ఉత్తర్వుల్లో సూచించింది. నాలుగేళ్ల కిందట కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో బయోమెట్రిక్ హాజరు విషయంలో సడలింపులు ఇచ్చింది. ప్రస్తుతం మళ్లీ దీనిని తప్పనిసరి చేసింది. ఎవరైనా ఉదయం 9.15 గంటలు దాటిన తర్వాత వస్తే సగం రోజు సాధారణ సెలవుగా పరిగణిస్తామని వెల్లడించింది.
‘‘ఏదైనా కారణంతో ఉద్యోగి కార్యాలయానికి రాకుంటే ముందుగానే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.. సాధారణ సెలవు కోసం దరఖాస్తు చేసుకోవాలి’’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది. తమ తమ పరిధిలోని ఉద్యోగుల హాజరు, సమయపాలనను ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పనిచేస్తాయి. కానీ, జూనియర్ స్థాయి ఉద్యోగులు ఆలస్యంగా వచ్చి, త్వరగా వెళ్లిపోవడం సర్వసాధారణంగా మారిపోయింది. దీంతో పనులకోసం ఆఫీసులకు వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు.
అయితే, తాము రాత్రి 7 గంటల వరకు ఉంటున్నామని, తమకు నిర్ణీత కార్యాలయ వేళలు లేవని సీనియర్ అధికారులు వాపోతున్నారు. అంతేకాదు, కరోనా తర్వాత ఎలక్ట్రానిక్ ఫైల్స్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో సెలవులు, వీక్లీ ఆఫ్ రోజు కూడా పనిచేయాల్సి వస్తుందని చెబుతున్నారు. కాగా, 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆఫీసు వేళలను అమలు చేయాలని ఆదేశించారు. అయితే, దీనిని ఉద్యోగులు తీవ్రంగా ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గారు.
ఇక, కోవిడ్‌కు ముందు బయోమెట్రిక్ హాజరు వ్యవస్థ తీసుకురాగా... సీనియర్ అధికారులు క్యూలో నిలబడే అవసరం లేకుండా వారి టేబుల్‌పై బయోమెట్రిక్ పరికరాలను అమర్చారు. తాజా ఉత్తర్వులు.. బయోమెట్రిక్ హజరును పునరుద్ధరించాలని గతేడాది జారీ చేసిన ఆదేశాలకు కొనసాగింపు. కోవిడ్ వ్యాప్తి అదుపులోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 2022లో పునఃప్రారంభించారు. ‘అదేపనిగా ఆలస్యంగా రావడం.. ఆఫీసు నుంచి త్వరగా వెళ్లిపోవడం వంటివి తీవ్రంగా పరిగణించాలి.. వాటిపై చర్యలు తీసుకోవచ్చు’ ఉత్తర్వులో స్పష్టం చేశారు.
బయోమెట్రిక్ విధానం అమలు చేయని పలు విభాగాల్లోని ఉద్యోగులు ఆలస్యంగా రావడం, ఆఫీసులు ఎగ్గొట్టడం వంటివి చేస్తారు. తాజా ఆదేశాలు అలాంటి వారికి అడ్డుకట్టవేస్తాయని భావిస్తున్నారు.