తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో కల్తీసారా మరణాల ఘటన యావత్తు దేశాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ 55 మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని భావిస్తున్నారు. వివిధ ఆసుపత్రుల్లో 113 మంది చికిత్స పొందుతుండగా... వీరిలో దాదాపు 30 మంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే, కల్తీసారా విషయంలో కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ తొలుత చేసిన నిర్లక్ష్యపు ప్రకటనే కొంపముంచిందని భావిస్తున్నారు. ఆయన వల్లే కరుణాపురం గ్రామాన్ని శ్మశానంగా మారిందనే ఆరోపణలున్నాయి.
బుధవారం కరుణాపురంలో కల్తీసారా తాగి పెయింటింగ్ పనిచేసుకునే దివ్యాంగుడు సురేష్ (35) తొలుత చనిపోగా.. గంటల వ్యవధిలోనే అతడి భార్య వడివుక్కరసి ప్రాణాలు ఒదిలింది. అయితే, ఇద్దరిదీ సాధారణ మరణమేనని వైద్యులు నిర్దారించినట్టు సురేష్ తమ్ముడు ఆరోపించారు. కల్తీసారా వల్లే చనిపోయారని వైద్యులు గుర్తించి అప్రమత్తం చేస్తే ఇంత నష్టం జరిగుండేదికాదని ఆవేదనకు గురయ్యారు. అసలు కారణాలను గుర్తించడంలో వైద్యులు విఫలమయ్యారా? లేదా అధికారులు దాచిపెట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సురేశ్, ఆయన భార్య వడివుక్కరసి కల్తీసారా తాగడం వల్ల చనిపోలేదని కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ ప్రకటన చేసినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయన ప్రకటన వెలువడిన తర్వాత ఆ సారా తాగారని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. మరోవైపు, నిర్లక్ష్యంగా వ్యవహరించారని కలెక్టర్‌ను బదిలీ చేసిన స్టాలిన్ ప్రభుత్వం.. ఎస్పీని సస్పెండ్ చేసింది.
కల్తీసారా మరణాలపై మద్రాసు హైకోర్టులో అన్నాడీఎంకే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ డి.కృష్ణకుమార్, జస్టిస్ కె.కుమరేశ్‌బాబు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇలాంటి ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోందని మండిపడింది. గతేడాది కూడా ఇదే తరహా ఘటన జరిగినప్పటికీ గుణపాఠాలు ఎందుకు నేర్చుకోలేదని నిలదీసింది. మనుషుల ప్రాణాలంటే అంత నిర్లక్ష్యం ఎందుకని, చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, సారాలో కలిపిన మిథనాల్ పుదుచ్చేరి నుంచి సరఫరా అయినట్లు గుర్తించామని సీఎం స్టాలిన్ ప్రకటించారు. బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టే ప్రసక్తేలేదని ఆయన పునరుద్ఘాటించారు.