ఆయనో సీఆర్పీఎఫ్ జవాన్. సుమారుగా మూడు నెలల కిందటే పెళ్లైంది. నవ దంపతులు అంటే ఎంత కలిసి మెలిసి ఉండాలి. కానీ.. ఆ వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే తన చేతికి మట్టి అంటకూడదనే పన్నాగం పన్నాడు . ఇందుకు సాంకేతికతను వినియోగించుకున్నాడు. హత్య చేసినా దొరక్కుండా ఉండటం ఎలా అనే దానిపై యూట్యూబ్‌లో వీడియోలు చూసి కట్టుకున్న ఆలిని.. కడతేర్చాడు. అయితే ఊహించని విధంగా చేసిన పొరబాటుతో పోలీసులకు చిక్కాడు.
విజయనగరం జిల్లాలో సంచలనం సృష్టించిన వివాహిత హత్యకేసును పోలీసులు ఛేదించారు. కట్టుకున్నవాడే కాలయముడై ఆమెను హత్య చేసినట్లు గుర్తించారు. హత్యచేసిన సీఆర్‌పీఎఫ్ జవాన్ జగదీష్‌ను అరెస్టు చేశారు. అనంతరం కేసు వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక అసలు వివరాల్లోకి వస్తే.. విజయనగరం జిల్లా బంగారమ్మపేటకు చెందిన అనూష అనే యువతికి, నక్కా జగదీష్ అనే సీఆర్‌పీఎఫ్ జవానుతో సుమారుగా మూడు నెలల కింద వివాహమైంది. అయితే ఈ పెళ్లి జగదీష్‌కు ఇష్టం లేకుండా జరిగింది. బలవంతంగా పెళ్లి చేశారంటూ అనూషను పుట్టింట్లోనే వదిలేసి జవాన్ ఉద్యోగానికి జగదీష్ వెళ్లిపోయాడు. అయితే ఇటీవలే సొంతూరికి తిరిగివచ్చిన జగదీష్.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు.
ఈ క్రమంలోనే భార్య అనూష అడ్డును తొలగించుకోవాలని జగదీష్ నిర్ణయించుకున్నాడు. అనూషను తీసుకుని వివిధ ప్రదేశాలు తిరిగాడు. ఆ తర్వాత తిరిగి పుట్టింట్లో వదిలిపెట్టాడు. అనంతరం దొరక్కుండా హత్య చేయడం ఎలా అనే దానిపై యూట్యూబ్‌లో వీడియోలు చూసి మర్డర్ ప్లాన్ రెడీ చేసుకున్నాడు జగదీష్. ప్లాన్ ప్రకారం జూన్ 16వ తేదీ ఇంటికి వెళ్లిన జగదీష్.. అనూషతో గొడవపడ్డాడు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న నైలాన్ తాడుతో అనూష మెడకు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టుగా తనను ప్రసాద్ అనే వ్యక్తి వేధిస్తున్నాడని, అందుకే చనిపోతున్నానంటూ అనూష సెల్ ఫోన్ నుంచి ఆమె కుటుంబసభ్యులకు మెసేజ్ పెట్టాడు.
అయితే ఇక్కడే మనోడి ప్లాన్ రివర్సైంది. ముందుగానే తన సెల్ ఫోన్‌లో మెసేజ్ రాసుకొచ్చిన జగదీష్.. దానిని అనూష ఫోన్ లోకి కాపీ చేశాడు. హత్య చేసిన తర్వాత ఒకేసారి అనూష తండ్రి, అన్న, స్నేహితురాలతో పాటుగా తనకు కూడా మెసేజ్ పంపుకున్నాడు. అయితే మెసేజ్‌లో ఉన్నది నిజమని నమ్మి.. అనూష కుటుంబసభ్యులు ప్రసాద్ ఇంటిపైకి దాడికి కూడా వెళ్లారు. అయితే విచారణలో ఒకేసారి నలుగురికి మెసేజ్‌లు ఎలా వెళ్లాయనే అనుమానం పోలీసులకు కలిగింది. అలాగే ప్రసాద్ కాల్ రికార్డులు పరిశీలిస్తే ఏడాది నుంచి అనూషకు, ప్రసాద్‌కు మధ్య ఎలాంటి సంభాషణలు లేవని తేలింది. దీంతో జగదీష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమ స్టైల్లో విచారిస్తే అసలు నిజం తెలిసింది. దీంతో జగదీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.