ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా కడప విమానాశ్రయంలో దిగిన వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం లభించింది. వైసీపీ కార్యకర్తలు, అభిమానాలు భారీగా తరలివచ్చారు. ఆ తర్వాత కడప ఎయిర్‌పోర్టు నుంచి పులివెందులకు వెళ్లిన జగన్‌ను కలిసేందుకు భారీగా వైసీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం జన సందోహంగా మారిపోయింది. ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన తర్వాత జగన్‌కు మేమున్నాం అంటూ వారంతా వచ్చి మద్దతు తెలిపారు. పులివెందుల పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఇవాళ ఆయన కడప నుంచి పులివెందులకు వెళ్తుండగా రామరాజు పల్లి వద్ద జగన్ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి. కాన్వాయ్‌లోని ఇన్నోవా వాహనం ఒక్సారిగా బ్రేక్ వేయగా.. దాని వెనుక ఉన్న ఫైర్ ఇంజిన్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.