వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ప్యాలెస్ ల పిచ్చి పట్టిందంటూ టీడీపీ విమర్శలపై సుధాకర్ బాబు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో కట్టిన ఎన్టీఆర్ ట్రస్టు ప్యాలెస్సా? లేక గుడిసె నా? అని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే తమ పార్టీ కార్యాలయాలకు స్థలాల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసి, అన్ని అనుమతులతో నిర్మాణాలు చేస్తున్నామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. ఎక్కడా అక్రమ నిర్మాణాలు చేయలేదన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ కట్టినవి ప్యాలెస్లు అయితే, టీడీపీ కట్టినవి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ తన కార్యాలయాలుగా నిర్మించిన భారీ భవనాల చిత్రాలను ఆయన విడుదలచేశారు. టీడీపీ హయాంలో ఆపార్టీ ఆఫీసులకోసం చేసిన భూ కేటాయింపులు, వాటికి సంబంధించిన జీవోల కాపీలను పత్రికా సమావేశంలో చూపించిన సుధాకర్ బాబు వాటిని మీడియాకు విడుదలచేశారు.