ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యగమనిక.. నేటి నుంచి 45 రోజులపాటు 26 రైళ్లను రద్దు చేసింది రైల్వేశాఖ. రద్దు చేసిన రైళ్లలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ ఎక్స్‌ప్రెస్ సహా రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కారణంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు కష్టాలు తప్పేలా లేవు. ఈ రైళ్లను ఉన్నట్టుండి రద్దు చేయడంతో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని.. విజయవాడ డివిజన్‌లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే పనులు ఆలస్యం అయ్యాయని.. తప్పని సరి పరిస్థితుల్లో రైళ్లను రద్దు చేయాల్సి వస్తోందని అధికారులు తెలిపారు.
కాకినాడ టౌన్-తిరుపతి(17249), మచిలీపట్నం-విశాఖపట్నం(17219) ఎక్స్‌ప్రెస్, పుదుచ్చేరి-కాకినాడ పోర్టు(17643) సర్కార్ ఎక్స్‌ప్రెస్, గుంటూరు-రాయగడ (17243), కాకినాడ టౌన్-లింగంపల్లి(12775) సూపర్‌ఫాస్ట్, విశాఖపట్నం-మహబూబ్‌నగర్(12861) సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఆదివారం నుంచి రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం-మచిలీపట్నం (17220), కాకినాడ టౌన్-తిరుపతి(17250), రాయగడ-గుంటూరు(17244) ఎక్స్‌ప్రెస్‌లు, మహబూబ్ నగర్-విశాఖపట్నం(12862) కాకినాడ పోర్టు-పుదుచ్చేరి (17644) సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, రాజమహేంద్రవరం-విశాఖపట్నం, కాకినాడ పోర్టు-విజయవాడ మధ్య నడిచే మెము రైళ్లు సోమవారం నుంచి రద్దు చేశారు. అలాగే కడియం - నిడదవోలు మధ్య రైల్వే ట్రాక్ ఆధునికరణ కోసం.. ఆగస్టు 10వ తేదీ వరకు నెలన్నర పాటు రైళ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.