అమరావతి రైతులు మరో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అదేంటి అమరావతి ఉద్యమానికి రైతులు ముగింపు పలికారు కదా.. ఈ పాదయాత్ర ఎందుకునే అనుమానం రావొచ్చు. గతంలో ఉద్యమంలో భాగంగా పాదయాత్ర చేసిన రైతులు.. ఈసారి ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఈ పాదయాత్రను చేపట్టారు. 1631 రోజుల పాటూ అమరావతి ఉద్యమం కొనసాగింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటుగా అమరావతిలో పనులు కూడా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని ప్రకటించారు.
మొత్తానికి 1631 రోజుల తర్వాత తమ ఆకాంక్షలు నెరవేరడంతో అమరావతి రైతులు తిరుమలకు కృతజ్ఞత పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి మహిళలు, రైతులు తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. ఏపీలో ప్రభుత్వం మారి.. మళ్లీ అమరావతి పనులు ప్రారంభమైతే తిరుమల వరకు పాదయాత్రగా వస్తామని ఉద్యమ సమయంలో రైతులు మొక్కుకున్నారు. అందుకే సోమవారం ఉదయం పాదయాత్రను తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ప్రారంభించారు. ఈ పాదయాత్ర 20 రోజుల పాటు కొనసాగనుంది.
మరోవైపు అమరావతి రాజధాని రైతులు విజయవాడ ఇంద్రకీలాద్రికి కూడా ఆదివారం రోజు పాదయాత్ర చేపట్టారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం.. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం.. రాజధాని ఉద్యమం విజయం సాధించడంతో కనకదుర్గమ్మ ఆలయానికి పాదయాత్రగా వెళ్లారు. తుళ్లూరు శిబిరం నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు, కరకట్ట, ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. రైతులు, మహిళలు పొంగళ్లు తయారు చేసి పూజలు నిర్వహించారు. కనకదుర్గమ్మకు సారె సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అమరావతి పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా కూటమి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని అమ్మవారికి మొక్కుకున్నారు.
అమరావతి ఉద్యమ సమయంలో కూడా అమరావతి రైతులు పాదయాత్రలు చేపట్టారు. ముందు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అంటూ అమరావతి నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్లారు. ఆ తర్వాత అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి ఆలయానికి పాదయాత్ర చేపట్టగా.. కోనసీమ జిల్లాలో పాదయాత్ర ఆగిపోయిది. ఆ తర్వాత కొందరు అమరావతి జేఏసీ నేతలు ఆ పాదయాత్రను పూర్తి చేశారు. ఈ మధ్యలోనే అమరావతి ఉద్యమ సమయంలో రైతులు, మహిళలు విజయవాడ దుర్గమ్మ ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి ప్రాంత రైతులు, మహిళలు వరుసగా తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.