తెలుగుదేశం పార్టీ ఎంపీ ఢిల్లీలో లోక్‌సభకు సైకిల్‌పై వెళ్లారు. ఢిల్లీలోని తాను నివాసం ఉంటున్న అతిథి గృహం నుంచి సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంట్‌కు వెళ్లారు. ముందుగా తన తల్లికి పాదాభివందనం చేసిన అప్పలనాయుడు.. అనంతరం కుటుంబంతో కలిసి బయటకు వచ్చారు. అక్కడి నుంచి సైకిల్‌పై బయల్దేరి పార్లమెంట్‌కు చేరుకున్నారు. లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టబోతున్న అప్పలనాయుడు.. తెలుగు సంప్రయామైన పంచె కట్టులో కనిపించారు. ఇవాళ అప్పలనాయుడు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
కలిశెట్టి అప్పలనాయుడు టీడీపీలో సాధారణ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించారు.. ఆ తర్వాత పార్టీలో పలు కమిటీల్లో పనిచేశారు. అనూహ్యంగా 2024 ఎన్నికల్లో ఆయనకు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కింది. ఆయన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌పై 2లక్షల 49వేల 351 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కలిశెట్టి అప్పలనాయుడు ఎంపీగా గెలిచిన వెంటనే ప్రజల్లోకి వెళుతున్నారు.. ఆయన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని మెట్టవలస ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రాత్రికి హాస్టల్‌లోనే ఎంపీ బస చేశారు.
మరోవైపు కలిశెట్టి అప్పలనాయుడు కీలక ప్రకటన కూడా చేశారు. ఈనాడు సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావు స్మారకార్థానికి గుర్తుగా అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా తెలుగు పాత్రికేయులకు ప్రత్యేక పురస్కారాలు ప్రదానం చేస్తానన్నారు. తన కుమార్తె పేరుతో ఏర్పాటు చేసిన నిఖిల కలిశెట్టి వైద్య, విద్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పాత్రికేయులకు పురస్కారాలు ఇస్తానని తెలిపారు. ఈ అవార్డుల కోసం సీనియర్ జర్నలిస్టులతో మూడు రోజుల్లో కమిటీ వేసి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. మరో 20 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేసి రామోజీరావు స్మారక పురస్కారాలను ప్రదానం చేస్తానన్నారు. బహుమతిగా రూ.20వేలు, ఒక పుస్తకం ఇవ్వనున్నట్లు తెలిపారు.