దాదాపు 5 శతాబ్దాలుగా హిందువులు ఎదురుచూస్తున్న కల.. ఈ ఏడాది జనవరిలో ఆవిష్కృతం అయింది. శ్రీరాముడి జన్మస్థలం అయిన అయోధ్యలో దివ్య రామమందిరం నిర్మాణం పూర్తి చేసుకుని.. ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం.. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇక దాదాపు రూ.1800 కోట్లతో నిర్మిస్తున్న ఈ అయోధ్య రామ మందిరం.. ఎంతో ప్రత్యేకతలు, విశిష్ఠతలను కలిగి ఉందని ప్రభుత్వాలు పేర్కొన్నాయి. 1000 ఏళ్ల పాటు ఆలయం చెక్కుచెదరకుండా నిర్మిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేర్కొంది. అయితే తాజాగా అయోధ్య రామ మందిరంలో నీరు లీకేజీ కావడం, గర్భగుడిలోకి వర్షపు నీరు చేరడం తీవ్ర దుమారానికి కారణం అయింది.
అయోధ్య రామాలయం ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ తాజాగా మీడియాతో మాట్లాడారు. భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరిగిన తర్వాత కురిసిన తొలి వర్షాలకే ఆలయ పై కప్పు నుంచి నీరు కారుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాల రాముడి గర్భగుడిలోకి నీరు వచ్చి చేరారని చెప్పారు. దీంతో ఆలయాన్ని ప్రారంభించి ఆరు నెలలు కూడా గడవకముందే లీకేజీలు ఏర్పడటం తీవ్ర విమర్శలకు తావిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. అయోధ్య రామ మందిర నిర్మాణ పటిష్టతపై తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయని.. సత్యేంద్ర దాస్ తెలిపారు.
అయోధ్య రామాలయ పైభాగాన్ని సరిగ్గా నిర్మించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. నిర్మాణ దశలో ఉన్న సమస్యలేంటో గుర్తించి వాటిని ఒకట్రెండు రోజుల్లో పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అసలే ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సమస్య పరిష్కరించకుంటే.. రానున్న రోజుల్లో గర్భగుడిలో పూజలు చేయడం కష్టంగా మారుతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం అయోధ్య రామాలయంలో ఏర్పడిన సమస్యను అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షానికి వర్షపు నీరు అంతా రామ్ లల్లా విగ్రహం చుట్టూ వచ్చి చేరిందని పేర్కొన్నాయి. ఆలయంలో లీకేజీ సమస్య చాలా ముఖ్యమైందని దాన్ని త్వరగా పరిష్కరించాలని సత్యేంద్ర దాస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. అయోధ్య రామ మందిర నిర్మాణం వచ్చే ఏడాది పూర్తి కానున్నట్లు ఇప్పటికే ఆలయ ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి. ఇక 2025 కు కేవలం ఏడాది మాత్రమే మిగిలి ఉందని.. చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయని సత్యేంద్ర దాస్ తెలిపారు. కాబట్టి నిర్మాణ పనులు ఏడాదిలోపు పూర్తయ్యే అవకాశం లేదని.. నిర్ణీత స్థలాల్లో ఇతర దేవుళ్ల విగ్రహాలు ఉంచే పనులు జరుగుతున్నాయని చెప్పారు.