ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న మహానాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి, రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఆమె మాట్లాడుతూ..... మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నారని అన్నారు. ఇందులో 2వేల ఉపాధ్యాయ పోస్టులు ఎస్టీలకు లభించే అవకాశం ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కేవలం 6,100 టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చిందని, ఇది కూడా ఎన్నికలకు ముందు ప్రకటించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై చేశారన్నారు. సోమవారం మంత్రి మండలిలో దానిని ఆమోదించడం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముందుందని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అమలు చేశారన్నారు. సామాజిక పింఛన్లకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మూడు వేల రూపాయలు పింఛను అందిస్తున్న లబ్ధిదారులకు రూ.4 వేలు పెంచామన్నారు. నాలుగు వేలకు పెంచిన పింఛన్‌ను ఏప్రిల్, మే, జూన్ నెలలు కలిపి వచ్చే నెల ఒకటో తేదీన రూ.7వేలు ఆ మొత్తాన్ని సచివాలయ ఉద్యోగులతో ఇంటి వద్దకు అందిస్తామని, దీనికి మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. దివ్యాంగులు ఇస్తున్న రూ.3వేలు పింఛన్ రూ.6 వేలకు, క్షయవ్యాధిగ్రస్తులకు ఇస్తున్న రూ.5వేలు పింఛను రూ.15 వేలకు, కిడ్నీ, లివర్ సంంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న రూ.5వేలు పింఛన్‌ను రూ.10వేలు పెంచారని వివరించారు. అన్న క్యాంటీన్ పునఃప్రారంభిస్తున్నట్టు చెప్పారు.