రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి టీడీపీ కూటమి సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. నిరుద్యోగుల కలలను సాకారం చేసేందుకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన మెగా డీఎస్సీ హామీని సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జూలై 1న షెడ్యూలు విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మెగా డీఎస్సీకి సోమవారం కేబినెట్ ఆమోదం లభించింది. దీంతో మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఎన్నికలకు ముందు గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేయనున్నారు. జీవో త్వరలో జారీ కానుందని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఎన్నికలకు ముందు నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలను రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. ఆ ఫలితాలు విడుదల చేసిన తర్వాత మళ్లీ టెట్ నిర్వహిస్తారు. తొలుత టెట్ నిర్వహించాలా? లేదా? అనే విషయంపై కేబినెట్‌లో చర్చించారు. తాజాగా బీఈడీ, డీఎడ్ కోర్సులు పూర్తిచేసిన వారికి మేలు చేసేలా మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీచేయనందున ఈ ప్రభుత్వం మెగా డీఎస్సీని వీలైనంత వేగంగా పూర్తిచేయాలని భావిస్తోంది. గత ఐదేళ్లపాటు నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురుచూశారు. ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో హడావుడిగా నోటిఫికేషన్ జారీచేసినా పరీక్షలు నిర్వహించేలోగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం చేశారు. గత ప్రభుత్వం తరహాలో అదిగో ఇదిగో అని నిరుద్యోగులను మభ్యపెట్టకుండా ఇచ్చిన హామీ ప్రకారం వీలైనంత వేగంగా భర్తీ పూర్తిచేయాలని ప్రయత్నిస్తోంది. తొలి కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై ఎక్కువ సేపు చర్చ జరిగింది. టెట్ నిర్వహిస్తే ఎలా చేయాలి? లేకుండా ఎలా చేయాలి? అనేదానిపై పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ రెండు ఆప్షన్లతో ప్రతిపాదనలు తయారుచేశారు. మంత్రి లోకేశ్ సూచనతో టెట్ నిర్వహణకే కేబినెట్ ఆమోదం తెలిపింది.